AP: వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ కవచం

22 Aug, 2021 08:32 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ఇప్పటికే 3,772 మసీదులు, దర్గాల ఆస్తులకు జీపీఎస్‌ మ్యాపింగ్‌ పూర్తి

మరో 1,206 వక్ఫ్‌ భూముల మ్యాపింగ్‌కు కసరత్తు

రీ సర్వేతో వక్ఫ్‌ బోర్డు ఆస్తుల గుర్తింపు

అక్రమార్కుల చెరలో ఉన్న 495.80 ఎకరాలు స్వాధీనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు సర్కార్‌ నడుంబిగించింది. ఇప్పటికే రీసర్వే ద్వారా గుర్తించిన ఆస్తులను కాపాడటంతోపాటు అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందుకు ప్రభుత్వం సాంకేతిక పద్ధతులను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మైనార్టీ శాఖ పర్యవేక్షణలో రెండో విడత రీసర్వే ఇటీవల మొదలైంది. వక్ఫ్‌ బోర్డు గుర్తింపు పొందని మసీదులు, వాటికి చెందిన స్థలాలు, గుర్తింపు పొందిన మసీదుల ఆస్తులను రీసర్వే ద్వారా అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 3,674 వక్ఫ్‌ ఆస్తులను అధికారులు గుర్తించారు.

చదవండి: ‘వర్జీనియా’ రైతుకు ‘పొగ’

సర్వే చేసిన వాటిలో 3,295 వక్ఫ్‌ ఆస్తులకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు కర్నూలు, పశ్చిమగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 223 వక్ఫ్‌ భూములు, 3,772 మసీదులు, దర్గాల ఆస్తులకు జీపీఎస్‌ మ్యాపింగ్‌ను పూర్తి చేశారు. తద్వారా ఆ ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మరో 1,206 వక్ఫ్‌ భూములు, 69 వక్ఫ్‌ సంస్థలకు అనుబంధ ఆస్తుల మ్యాపింగ్‌కు కసరత్తు జరుగుతోంది.

వక్ఫ్‌ భూముల పరిరక్షణకు రీ సర్వే కొనసాగుతోంది..
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్‌ భూముల పరిరక్షణకు రీ సర్వే కొనసాగుతోంది. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇప్పటికే రీ సర్వే పూర్తి చేశాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతోపాటు పలు జిల్లాల్లో రీ సర్వేను కొనసాగించేలా చర్యలు చేపట్టాం. రీసర్వేను వేగంగా పూర్తి చేసి అన్యాక్రాంతమైన వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. జియోఫెన్సింగ్‌ ఏర్పాటును వేగంగా చేపట్టేలా అధికార సిబ్బందిని సమాయత్తం చేశాం. రాష్ట్రంలో 30 మసీదులు, దర్గాలకు చెందిన 495.80 ఎకరాల వక్ఫ్‌ భూములను అక్రమార్కుల చెర నుంచి స్వాధీనం చేసుకున్నాం.
– గంధం చంద్రుడు, కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ

మరిన్ని వార్తలు