AP State Revenue: కోలుకుంటున్న ఖజానా 

16 Mar, 2022 03:32 IST|Sakshi

క్రమంగా పెరుగుతున్న రాష్ట్ర సొంత ఆదాయం 

2019–20, 2020–21 ఆర్థిక ఏడాదుల్లో రూ.57,000 కోట్ల చొప్పునే రాబడి 

2021–22లో సవరించిన అంచనాల ప్రకారం రూ.73,690 కోట్లు 

పన్నేతర ఆదాయంలోనూ గణనీయ మార్పు 

ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతోనే ఈ పెరుగుదల 

సామాజిక ఆర్థిక సర్వే వెల్లడి

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం దీనిని సూచిస్తోంది. ఆర్థిక మందగమనంతో 2019–20లో రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ తర్వాత ఏడాది 2020–21లో కోవిడ్‌ లాక్‌డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి నేరుగా నగదు బదిలీ చేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది.

కోవిడ్‌ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఈ ఆర్థిక ఏడాది 2021–22లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర సొంత ఆదాయం రూ.73,690 కోట్లకు చేరుతుందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషించింది. అయితే, 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం రూ.57,601 కోట్లు రాగా ఆ మరుసటి సంవత్సరం 2020–21లో రూ.57,427 కోట్లు మాత్రమే వచ్చిందని పేర్కొంది. అంటే.. 2019–20లో వచ్చిన ఆదాయం కూడా 2020–21లో రాలేదు.

ప్రధానంగా లాక్‌డౌన్‌లో రవాణా ఆంక్షల కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2021–22లో అమ్మకం పన్నుతో పాటు ఎస్‌జీఎస్‌టీ, రవాణా, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ రంగాలన్నింటిలో ఆదాయం పెరుగుదల నమోదైనట్లు సర్వే పేర్కొంది. అలాగే.. పన్నేతర ఆదాయం కూడా పెరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది. 2019–20లో పన్నేతర ఆదాయం రూ.3,315 కోట్లు రాగా 2020–21లో రూ.3,395 కోట్లు వచ్చింది. 2021–22లో సవరించిన అంచనాల మేరకు రూ.5,451 కోట్లు వస్తుందని అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు