రైతు ఖాతాల్లో ధాన్యం డబ్బు

17 Jan, 2021 03:42 IST|Sakshi

ఒక్కరోజే 378.74 కోట్లు జమ

ఖరీఫ్‌ ధాన్యానికి ఇప్పటివరకు రూ.2,826.63 కోట్లు చెల్లింపు

సాక్షి, అమరావతి: రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో ఆ బిల్లులను పౌర సరఫరాల సంస్థ రైతు ఖాతాలకు జమ చేస్తోంది. శనివారం ఒక్కరోజే రూ.378.74 కోట్లను ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో జమ చేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు 24.25 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని 2,171 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం సేకరించింది. రైతులకు రవాణా భారం లేకుండా కళ్లాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు చెందిన నిధులను సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర పథకాలకు మళ్లించడంతో అప్పటినుంచి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రూ.2,826.63 కోట్లను చెల్లించగా.. మిగిలిన రైతులకు కూడా త్వరగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.  దీంతో రూ.వెయ్యి కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం రైతులకు తక్షణ చెల్లింపుల కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా బ్యాంక్‌ నుంచి రూ. 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 

సకాలంలో చెల్లిస్తాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రూ.2,826 కోట్లకు పైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశాం. 
– కోన శశిధర్, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ

ఆనందం రెట్టింపైంది
సంక్రాంతి పండుగ దృష్ట్యా బిల్లులు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో నా బ్యాంక్‌ ఖాతాకు రూ.1,44,000 జమయ్యింది. దీంతో పండుగ పూట ఆనందం రెట్టింపైంది. పెండింగ్‌ బిల్లులు రావడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందన్న సంతృప్తి కల్గింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– జున్నూరి సూర్యనారాయణ, రైతు, నాగవరం గ్రామం, ఉప్పలగుప్తం మండలం, తూర్పు గోదావరి

 పంట కోసం చేసిన అప్పు తీర్చేశా..
సంక్రాంతి పండుగ సమయంలో ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కావడంతో కష్టాల నుంచి గట్టెక్కినట్‌లైంది. రైతుల ఇబ్బందులను సీఎం వైఎస్‌ జగన్‌  గుర్తించడం హర్షణీయం. పెండింగ్‌లో ఉన్న ధాన్యం బిల్లులు రావడంతో ఆ మొత్తంతో పంట కోసం చేసిన అప్పు తీర్చేశా. 
– కరెనిది గోవింద్, రైతు, కేశనకుర్రు పాలెం, ఐ.పోలవరం మండలం, తూర్పు గోదావరి 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు