తన గారాలపట్టి లేదని తెలిసి ఆ అవ్వ గుండె ఆగింది

26 Jan, 2022 12:07 IST|Sakshi

గడివేముల (కర్నూలు): మనవరాలంటే ఆ అవ్వకు పంచ ప్రాణాలు.. మనవరాలికి కూడా అవ్వపై ఎనలేని ప్రేమ.. ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమాభిమానాలు మృత్యువులోనూ తొలిగిపోలేదు. మనవరాలు పాముకాటుకు గురై ఈ లోకం వీడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అవ్వ.. ఆ మరణవార్త వినగానే తట్టుకోలేక పోయింది. చిన్నప్పుడు తాను ఎత్తుకు పెంచిన మనవరాలు కాస్త వయసొచ్చాక జేజీ.... ఏమైందంటూ బాగోగులు చూస్తూ వచ్చేది. వృద్ధాప్యంలో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ దగ్గరుండి చూసుకునేది. ఆకలేస్తే అన్నం, జబ్బు చేస్తే మందులు ఇలా మలిదశలో జేజిని అన్ని విధాలా చూసుకునేది.

చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..)

వారం రోజుల క్రితం కూలీ పనులకు వెళ్లిన మనవరాలు పాముకాటుకు గురై మంగళవారం చనిపోయిందని తెలుసుకున్న అవ్వకు లోకం శూన్యంగా మారింది. 17 ఏళ్లుగా మనవరాలి ప్రేమ నిండిన ఆమె ఇక తన గారాలపట్టి లేదని తెలిసి ఆ అవ్వ గుండె ఆగిపోయింది. ఇద్దరి మరణం ఏకకాలంలో సంభవించడంతో ఆ గ్రామ వాసులు హృదయ విదారకంగా ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన గడివేముల మండలం బిలకలగూడూరులో జరిగింది. గ్రామానికి చెందిన కాటెపోగు వెంకటసుబ్బయ్య, వెంకటలక్ష్మమ్మలకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో చివరి సంతానమైన రాణెమ్మ (17) తల్లిదండ్రులతో పాటు కూలీ పనులకు వెళుతుండేది. రాణెమ్మ వారం రోజుల క్రితం మినుము పంటలో కలుపు తీసేందుకు పొలం పనులకు వెళ్లింది. అక్కడ పాముకాటుకు గురైంది.

చదవండి: (రెండో పెళ్లి.. భార్య విలాసాలు తీర్చలేక..)

విషయం తెలుసుకున్న తోటి కూలీ మిత్రులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాణెమ్మ కోలుకోలేక మృతి చెందింది. మనవరాలి మృతి వార్త విన్న రాణెమ్మ జేజమ్మ వెంకటలక్ష్మమ్మ (72) వెంటనే ఓయమ్మా.. అంటూ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. జేజి, మనవరాలు ఇద్దరూ ఒకేరోజు నిమిషాల వ్యవధిలో మృత్యుపాలైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 

మరిన్ని వార్తలు