కృష్ణా...ముకుందా...మురారి

19 Aug, 2022 22:52 IST|Sakshi
విశేష అలంకారంలో శ్రీ మురళీకృష్ణుడు, స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి పూజలు 

కడప కల్చరల్‌:  శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలను గురువారం కడప నగరం ద్వారకానగర్‌లోని శ్రీ మురళీకృష్ణాలయంలో ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం ఈ సందర్భంగా మూలమూర్తికి విశేష అభిషేకాలు, అనంతరం కనుల పండువగా అలంకారం చేశారు. ఆలయం నిర్వాహకులు రామమునిరెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులందరికీ నిబంధనల మేరకు ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ధ్యాన మందిరంలో ఉత్పవమూర్తిని నిలిపి ఆయనతోపాటు గణపతి సచ్చిదానంద స్వామి మూర్తికి కూడా పూజలు చేశారు. రాయచోటి రైల్వేగేటు వద్దగల శ్రీకృష్ణాలయంలో కూడా కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. 

కృష్ణయ్యకు పూజలు 
కడప నగర సమీపంలోని అప్పరాజుపల్లె గ్రామంలో గురువారం కృష్ణునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణ ఛారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ అమర్‌నాథ్‌ యాదవ్‌ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు.   

రేపు కృష్ణాష్టమి పూజలు 
కడప నగరం గడ్డిబజారులోని శ్రీ లక్ష్మి సత్యానారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ్‌భట్టర్‌ తెలిపారు. శ్రీకృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం ప్రకారం ఈ కార్యక్రమాన్ని శనివారం పంచారాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  

పాఠశాలల్లో సందడి
కృష్ణాష్టమి ముందస్తు వేడుకల్లో భాగంగా కడప నగరానికి చెందిన ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో గురువారం రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. చిన్నికృష్ణులు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్న ఆ చిన్నారులను రిమ్స్‌ వైద్యులు అర్చన అభినందించారు. అనంతరం చిన్ని కృష్ణులతో కృష్ణయ్యకు ప్రార్థనలు నిర్వహించారు. భగవద్గీతా పఠనం చేయించారు.

పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు స్వీట్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్‌ హరికృష్ణ, సిబ్బంది సరస్వతి, సంధ్యారెడ్డి, వైశాలి, లక్ష్మిదేవి, భార్గవి, మేరి, పీఈటీ జయచంద్ర, జవహర్, లక్ష్మయ్య, శంకర్‌ పాల్గొన్నారు. దీంతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.

అలరించిన నృత్యాలు 
కడప కల్చరల్‌ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని స్థానిక ద్వారకానగర్‌లోగల శ్రీ మురళీ కృష్ణాలయం ప్రాంగణంలో పలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప స్పందన డాన్స్‌ అకాడమీ చిన్నారులు చేసిన నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విన్నావ.. యశోదమ్మ, భరత వేదమున, జయజయహే మహిశాసుర మర్ధిని వంటి నృత్యాలు అలరించాయి. ప్రజలు కరతాళ ధ్వనులతో చిన్నారులను ప్రోత్సహించారు. 

ముద్దులొలికే చిన్నికృష్ణయ్యలు 
శ్రీకృష్ణాష్టమి సందర్బంగా చిన్నారులు ఉన్న ఇళ్లలో చిన్ని కృష్ణయ్యలుగా దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారి పాపలకు చిన్నారి కృష్ణయ్య వేషాలను ధరింపజేసి తమ కంటి పాపల నిండుగా తనివి తీరాచూసుకుని మురిసిపోతున్నారు. పనిలో పనిగా గోపెమ్మలను కూడా సిద్ధం చేసి వెన్న తినిపించే ఘట్టాలను, ఉట్టికొట్టే ఘట్టాలను నిర్వహించి ముచ్చట తీర్చుకుంటున్నారు. పనిలో పనిగా మనోళ్లు మన జిల్లాకు మత సామరస్యంగా గల ఘనతను మరోమారు చాటారు. ఈ సందర్బంగా పలువురు ముస్లింలు కూడా తమ చిన్నారులకు కృష్ణుడి వేషాలు ధరింపజేసి మతాలకు అతీతంగా నిలిచి ఆనందాన్ని ఆస్వాదించారు. 

మరిన్ని వార్తలు