నాయనమ్మ వెంటే మనవడు.. 

30 Aug, 2020 12:28 IST|Sakshi
వృద్ధురాలు వెదురుపల్లి కాసులమ్మ మృతదేహం, వీరాచారి మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, ఇద్దరు కుమారులు 

అనారోగ్యంతో నాయనమ్మ, గుండెపోటుతో మనవడు మృతి 

విలపిస్తున్న కుటుంబ సభ్యులు  

ఎస్‌.కోట గౌరీశంకర్‌ కాలనీలో విషాదం  

తహసీల్దార్‌ సమక్షంలో దహనసంస్కారాలు  

ఎస్‌.కోట రూరల్‌: ఎస్‌.కోట పట్టణంలోని గౌరీశంకర్‌ కాలనీలో ఓ ఇంట విషాదం నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కాలనీకి చెందిన వెదురుపల్లి కాసులమ్మ (90) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె మనుమడు దివ్యాంగుడైన వెదురుపర్తి వీరాచారి (45) శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం 6 గంటలకు ఆయన నిద్ర లేచేసరికి  మీ నాయనమ్మ మృతిచెందిందని భార్య కామాక్షి తెలిపింది. అంతే.. ఆయన గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కరోనా భయంతో వీరిద్దరి మృతదేహాలను శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

పోలీసులకు సమాచారమిస్తే.. పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేయాలని, పంచాయతీ వారికి తెలియజేస్తే కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నారని, పర్మినెంట్‌ సిబ్బందిలో ఏడుగురు మహిళలేనంటూ జవాబిచ్చినట్టు మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు మృతుని బంధువుల్లో వైద్యశాఖలో పనిచేసే ఒక వ్యక్తి రెండు పీపీఈ కిట్లు తెప్పించి మృతదేహాలను బయటకు తీయించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న తహసీల్దార్‌ ఎల్‌.రామారావు కాలనీకి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలను తోపుడు రిక్షాలపై శ్మశాన వాటికకు తరలించారు. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తిచేయించారు. మృతుల కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సచివాలయ ఏఎన్‌ఎంను ఆదేశించారు.

రోడ్డున పడిన కుటుంబం  
పుట్టుకతో మూగ, చెముడుతో బాధపడుతున్న వీరాచారి టైలర్‌ వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య కామాక్షి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి వద్దనే మహిళలకు ఫ్యాషన్‌ డ్రెస్సులు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తల్లి సంవత్సరం కిందటే మరణించింది. తండ్రి, తమ్ముడు ఆనంద్, వీరాచారి కుటుంబాలు ఒక ఇంట్లోనే నివసిస్తున్నాయి. వీరాచారి మరణంతో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ మృతుని భార్య కామాక్షి బోరున విలపిస్తోంది.  

మరిన్ని వార్తలు