అత్తను గెంటేసిన కోడళ్లు! అనాథగా మారిన అవ్వ

5 Jun, 2022 08:45 IST|Sakshi

నా అనుకున్న వారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. రూ.లక్షలు విలువ చేసే ఆస్తిపాస్తులున్నాయి. ఒకరిపై ఆధారపడనవసరం లేదు. అయినా ఆ వృద్ధురాలు వీధిన పడింది. డబ్బు ముందు మానవ సంబంధాలు అడుగంటడంతో ఏడు పదుల వయసులో ఇతరుల దయాదాక్షిణ్యాలపై బతుకు బండి లాగిస్తోంది.   

రాప్తాడు/అనంతపురం కల్చరల్‌: రాప్తాడు మండలం గంగులకుంట గ్రామానికి చెందిన నారాయణమ్మకు 74 ఏళ్లు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్దన్నతో ఆమెకు వివాహమైంది. పెళ్లి అనంతరం గంగులకుంటలోనే వారు స్థిరపడ్డారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీనారాయణ సంతానం.  

కొడుకు మృతితో కష్టాలు మొదలు 
దాదాపు 20 ఏళ్ల క్రితం సిద్దన్న మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు కలిసే ఉంటున్నారు. తండ్రి బతికున్నప్పుడే కుమారుడు లక్ష్మీనారాయణ రాప్తాడుకు చెందిన ఓబుళమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కాకపోవడంతో రెండో పెళ్లికి లక్ష్మీనారాయణ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మేనమామ కుమార్తె లక్ష్మీదేవి అయితే తన తల్లిని బాగా చూసుకుంటుందని భావించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకున్నంత కాలం తల్లికి ఏ కష్టమూ రాలేదు. పదేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఆ తర్వాత నారాయణమ్మకు కష్టాలు మొదలయ్యాయి.  

జీమాను కట్టనే దిక్కు 
భర్త మరణించే నాటికి నారాయణమ్మ పేరుపై 12 సెంట్ల దొడ్డి, 6 ఎకరాల మెట్ట పొలం, రెండు ఇళ్లు, కొంత నగదు ఉండేది. స్థిరాస్తుల విలువ రూ. లక్షల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో కోడళ్లు చెరి సగం డబ్బు పంచుకుని నారాయణమ్మను పట్టించుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నా అనుకున్న తమ్ముడు సైతం కుమార్తె సుఖం కోసం అక్కను పట్టించుకోవడం మానేశాడు. ఆత్మాభిమానం.. అమాయకత్వమున్న నారాయణమ్మ ఎవరు చెప్పినా వినకుండా గ్రామం మధ్యలో జీమాను కట్టను ఆశ్రయించింది.  

మొండితనం... మంకుపట్టు 
జీమాను కట్టపై జీవనం సాగిస్తున్న నారాయణమ్మ తన ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కోడళ్ల ముఖం చూడనని భీష్మించుకుంది.  దీంతో నారాయణమ్మకు ఏమైనా జరిగితే గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించిన గ్రామస్తులే ఏ పూటకా పూట తిండి పెట్టి బాగోగులు చూస్తున్నారు. అధికారులు స్పందించి నారాయణమ్మ విషయంలో జోక్యం చేసుకుని ఆమె శేష జీవితం ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.   

(చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి)

మరిన్ని వార్తలు