తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’

21 Aug, 2022 17:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లేపాక్షి (సత్యసాయి జిల్లా): ఆస్తి పంపకాలు పూర్తయ్యాకే తాత శవాన్నెత్తాలంటూ ఓ మనవడు రగడకు దిగాడు. రెండో భార్య కుమార్తెకు రాసిచ్చిన ఎకరాను కూడా తనకే ఇవ్వాలంటూ నానా హంగామా చేశాడు. ఈ ఘటన మండలంలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన కార్పెంటర్‌ చిన్నహనుమయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కుమారుడు, చిన్న భార్యకు ఒక కుమార్తె సంతానం. పెద్దభార్య, కుమారుడు, చిన్న భార్య గతంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె వద్ద కొన్ని రోజులుగా ఉంటున్న చిన్నహనుమయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
(చదవండి: గుండెకోతను భరించి...)

ఈ క్రమంలోనే శనివారం మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన మనవడు (పెద్దభార్య కుమారుడి కొడుకు) నాగభూషణ ఆస్తి పంపకాలు పూర్తయ్యేదాకా శవాన్ని ఎత్తనిచ్చేది లేదని భీష్మించాడు. మూడున్నర ఎకరాల్లో ఓ ఎకరాను కుమార్తెకు లిఖిత పూర్వకంగా తాత రాసిచ్చాడని, అది కూడా తనకే చెందాలని రగడకు దిగాడు. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. అంతిమ సంస్కారాల తర్వాత ఏమైనా ఉంటే చూసుకోండని, గ్రామస్తులు చెప్పినా లెక్కచేయకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మనవడికి నచ్చజెప్పారు. బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే తలా చెయ్యి వేసి చిన్న భార్య కుమార్తె, అల్లుడితో కలిసి దహనసంస్కారాలు పూర్తి చేశారు.  
(చదవండి:  బ్యాగులో లక్షల రూపాయలు.. మర్చిపోయి రైలెక్కి సొంతూరుకు.. మళ్లీ తిరిగొచ్చి..!)

మరిన్ని వార్తలు