గడువులోగా గడపకు..

5 Oct, 2020 03:59 IST|Sakshi

నిర్ణీత కాలవ్యవధిలోగా అర్హులకు పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు

సాక్షి, అమరావతి: పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో గత చంద్రబాబు పాలనకు ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గతంలో రేషన్‌ కార్డులు, పింఛన్‌లు తదితర పథకాలు ఏవి కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. రకరకాల వివక్షలు, లంచాలు, జన్మభూమి కమిటీల సిఫార్సులు సరేసరి. ఈ నేపథ్యంలో అర్హులకు కాక అయినవారికే అందించిన సందర్భాలను మనం చూశాం. కానీ ఇప్పుడలా కాదు.. పింఛన్లు, బియ్యం కార్డులు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణీత గడువు విధించారు. ఆ గడువులోగా వాటిని అందించి తీరాలి. లేకుంటే పరిహారం చెల్లించాల్సి వస్తుందని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఈ నిర్ణీత గడువు కార్యక్రమాన్ని ఈ ఏడాది జూన్‌ 9 నుంచి ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న అతికొద్ది సమయంలోనే లబ్ధిదారులకు సంక్షేమాన్ని చేరువ చేయాలనే చిత్తశుద్ధితోనే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు.

► ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లికి చెందిన అంజమ్మకు రేషన్‌ కార్డు లేదు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. అయితే గత నెల 19వ తేదీ ఉదయం 11.28 గంటలకు గ్రామ సచివాలయంలో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసింది. సరిగ్గా 11.38 గంటలకు ఆమెకు బియ్యం కార్డును వలంటీర్‌ ఇంటికి తీసుకొచ్చి అందించారు. 
► వితంతు పింఛన్‌ నిమిత్తం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అర్జీ పెట్టిన అరగంటలోనే అంజమ్మకు అవి మంజూరయ్యాయి. 
► కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన కాటం ఓబేదు, మదిచెర్ల మేరీగ్రేస్, బొంతు జోజిబాబులకు దరఖాస్తు చేసుకున్న పావుగంటలో బియ్యం కార్డులు అందుకున్నారు. 
► దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే అర్హులకు బియ్యం కార్డు, పింఛన్‌ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామనే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ జూన్‌ 9వ తేదీన ప్రారంభించారు. 
► గడువులోగా మంజూరవుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు సీఎం స్వయంగా సమీక్షిస్తున్నారు. 
► ఈ నిర్ణీత గడువు కార్యక్రమం అమల్లోకి వచ్చి మరో నాలుగు రోజుల్లో నాలుగు నెలలు పూర్తికానుంది. ఇప్పటి వరకూ గడువులోగా అర్హులందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ,, బియ్యం కార్డులు, పెన్షన్లు మంజూరు చేశారు. బియ్యం కార్డుకు పది రోజుల గడువున్నా పలుచోట్ల నిమిషాల వ్యవధిలోనే మంజూరు చేసిన సందర్భాలున్నాయి. 
► అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు అందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అధికార యంత్రాంగం ప్రశంసిస్తోంది. 

నాలుగు నెలల్లోనే.. 
► సెప్టెంబర్‌ నెలాఖరు వరకు బియ్యం కార్డుల కోసం 16.36 లక్షల దరఖాస్తులు రాగా, నిర్ణీత కాల వ్యవధిలోపే 15.90 లక్షల మందికి మంజూరు చేశారు.
► సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ఆరోగ్యశ్రీ కార్డుల కోసం 54 వేల దరఖాస్తులు రాగా, నిర్ణీత కాల వ్యవధిలోనే 52 వేల మందికి మంజూరు చేశారు.
► సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పింఛన్ల కోసం 4.41 లక్షల దరఖాస్తులు రాగా, నిర్ణీత కాల వ్యవధిలో 4.11 లక్షల మందికి మంజూరు చేశారు. 

మరిన్ని వార్తలు