ప్రతి ఇంటా జగన్నినాదం 

15 Apr, 2023 04:58 IST|Sakshi

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ఎనిమిదో రోజూ విశేష స్పందన 

సొంతింటి కలను సీఎం సాకారం చేశారంటూ ప్రశంసలు 

ఇంటి వద్దే పింఛన్‌ అందిస్తూ బాసటగా నిలిచారన్న అవ్వాతాతలు 

మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ నినదిస్తున్న అన్ని వర్గాల ప్రజలు 

ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ 43 లక్షల కుటుంబాలకుపైగా మిస్డ్‌ కాల్స్‌ 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 46 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును వివరించడం.. ప్రభుత్వంపై విపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్వి జయంగా కొనసాగుతోంది. శుక్రవారం ఎనిమిదో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, సచివాలయాల కన్వి నర్లు, వలంటీర్లు, గృహ సారథులకు ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ సర్కార్‌కూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని కుటుంబ సభ్యులకు గృహ సారథులు అందించారు. సొంతిల్లు నిర్మించుకోవాలనే కలను సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని అక్కచెల్లెమ్మలు ప్రశంసించారు.

టీడీపీ ప్రభుత్వంలో పింఛన్‌ ఎప్పుడిస్తారో తెలిసేదే కాదని ఎత్తిచూపుతూ.. ఇప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు వచ్చి వలంటీరు రూ.2,750 చొప్పున పింఛన్‌ అందిస్తున్నారని అవ్వాతాతలు సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని సీఎం వైఎస్‌ జగన్‌ వేగవంతం చేసి.. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చారని  అన్నదమ్ములు ప్రశంసించారు. 

 సీఎం వైఎస్‌ జగన్‌కు పెరుగుతున్న మద్దతు  
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా గృహ సారథులు మెగా ప్రజా సర్వేను నిర్వహిస్తున్నారు. టీడీపీ సర్కార్‌కూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ ఐదు ప్రశ్నలను అడిగి.. కుటుంబ సభ్యులు చెప్పిన అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నారు.

ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రజలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తున్నారు. ఆ వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రాగానే కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఏడు రోజల్లో అంటే గురువారం నాటికి 55 లక్షల కుటుంబాలను జగనన్న సైన్యం నేరుగా కలిసింది. అందులో 43 లక్షల కుటుంబాలకు చెందిన ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నెంబర్‌కు మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న కొద్దీ సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల మద్దతు పెరుగుతోంది. 

ప్రతిపక్షాలకు ముచ్చెమటలు:   ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 
‘జగనన్నే మా భవిష్యత్‌ అంటూ అధికార వైఎస్సార్‌సీపీ చేపట్టిన మేగా పీపుల్స్‌ సర్వే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎన్నికలనగానే సాధరణంగా గుర్తొచ్చేది పాదయాత్రలు, రోడ్‌ షోలు ,ప్రచారార్భాటాలు. కానీ వీటన్నిటికీ భిన్నంగా.. గత ప్రభుత్వంతో బేరీజు వేస్తూ మా పరిపాలన ఎలా ఉందో చెప్పండి.. ఇదీ మా ప్రభుత్వంలో మీకు జరిగిన మేలు.. మా ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు సంక్షేమ పథకాల కింద నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసింది.. పాలనపై అవసరమైతే సలహాలివ్వండి తీసుకుంటాం.. అంటూ నిర్వహిస్తోన్న ఈ సర్వేకు అనూహ్య స్పందన లభిస్తోంది’ అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

శుక్రవారం రాత్రి తాడేపల్లిలోని సైన్స్‌ సిటీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 175 నియోజకవర్గాల పరిధిలోని 15 వేల సచివాలయాల్లో చేపట్టిన మేగా పీపుల్స్‌ సర్వే ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్యమ కెరటంలా ముందుకు సాగుతోందన్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తోన్న స్పందన, ఆదరణ చూసి విపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని చెప్పారు. వాడవాడలా మా నమ్మకం నువ్వే జగన్‌ అనే నినాదం హోరెత్తుతోందన్నారు.

కేవలం ఆరు రోజుల్లో 43 లక్షల కుటుంబాలు మిస్డ్‌ కాల్స్‌ ద్వారా జగనన్నకు మద్దతు తెలపటం చిన్న విషయం కాదన్నారు. ఈ కార్యక్రమం పార్టీ క్యాడర్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే నినాదాలతో షేర్‌ అవుతున్న ఫోటోలు, వీడియోలే ఇందుకు నిదర్శనం అని చెప్పారు.  

సీఎం మేలును ఎప్పటికీ మరిచిపోం.. 
భీమడోలు:  అన్ని విధాలా మేలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు భగవంతునితో సమానం అని, అందుకే ఆయన ఫొటోను దేవుడి గదిలో ఉంచామని ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లిలోని బీసీ కాలనీకి చెందిన సారిక వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు వివరించారు.

వాకిలికి   ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే స్టిక్కర్‌ అంటించబోగా.. ‘ఈ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మా అమ్మకు పింఛన్, నా భార్యకు చేయూత, పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందాము. ఇంత మేలు చేసిన సీఎంను మేం ఎప్పటికీ మరచిపోము. అందుకే ఆయన ఫొటోను అంటించాల్సింది ఇక్కడ కాదు’ అంటూ ఇటివ్వండని తీసుకుని దేవుడి గదిలో అంటించారు. ఇప్పుడు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.  

మరిన్ని వార్తలు