ప్రైవేటు ఆటకట్టు 

31 Oct, 2020 10:19 IST|Sakshi
అంగీకార పత్రంతో చేర్చుకుంటున్న గంట్యాడ మండలం ఎంపీపీ స్కూల్‌ ఉపాధ్యాయులు

టీసీలు ఇవ్వని ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్‌

అంగీకార పత్రంతో సర్కారు బడుల్లో చేరికకు గ్రీన్‌సిగ్నల్‌

చైల్డ్‌ ఇన్‌ఫోకు వచ్చేనెల రెండు వరకూ గడువు

ఇప్పటికే చేరిన 2.57 లక్షల మంది విద్యార్థులు 

విజయనగరం అర్బన్‌: ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సర్కారు బడుల్లో చేరాలంటే ఇక టీసీలతో పనిలేదు. సర్కారు ఇచ్చిన తాజా ఉత్తర్వుల మేరకు కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రంతో చేర్చుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రైవేటు విద్యాసంస్థలవారు బడిమానేసిన పిల్లలకు టీసీలు ఇవ్వడానికి సుతరామూ అంగీకరించకపోవడంతో సర్కారు బడుల్లో చేరికకు అవరోధంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారమైంది. సర్కారు బడుల్లో కొత్త గా చేరే విద్యార్థులు టీసీలు ఇవ్వలేకపోతే వారి పేర్లు ప్రభుత్వ ఆన్‌లైన్‌ చైల్డ్‌ఇన్‌ఫోలో చేరే అవకాశం లేదు. ఆ విద్యార్థులు ఇంకా ప్రైవేటు స్కూల్‌లో ఉన్నట్టే లెక్క. తల్లిదండ్రుల అంగీకార పత్రం చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదుకు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదుకు గడువు పెంపు 
రేషనలైజేషన్‌ మార్గదర్శకాలపై ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. 2020 ఫిబ్రవరి 29 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలనే మార్గదర్శకాలను సవరించి తాజా విద్యా ర్థుల నమోదునే పరిగణించాలని ఉపాధ్యాయులు కోరారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల 2వ తేదీ నాటికి చైల్డ్‌ ఇన్‌ఫోలో ఉన్న ప్రవేశాల ఆధారంగా చేయా లని ఆదేశించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వారి పే ర్లు నామమాత్రంగానే ఉన్నాయి. దీనివల్ల చైల్డ్‌ఇన్‌ఫో ఆన్‌లైన్‌  జాబితాలో ఇంకా ప్రైవే టు స్కూళ్లలో ఉన్నట్లే నమోదు ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తల్లిదండ్రుల అంగీకార పత్రంతో చేరినట్టు ఆన్‌లైన్‌ చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదుకు అవకాశం కల్పిస్తూ వచ్చే నెల 2వ తేదీ వరకు నమోదు గడువు పెంచారు.  

ఇప్పటికే చేరిన 2.57 లక్షల మంది విద్యార్ధులు 
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరుగుతోంది. ఇప్పటికే 2,57,051 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి చేరారు. టీసీలు లేకుండా వచ్చిన వారు మరో 30 వేల మంది వరకు ఉన్నా రు. వారి సంఖ్య ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఇందులో 1, 6వ తరగతులకు పూర్తి స్థాయిలో కొత్త స్కూళ్ల నుంచి చేరాల్సి ఉంటుంది. మిగిలిన తరగతులకు ముందు తరగతుల నుంచి ప్రమోట్‌ అవుతారు. ప్రమోట్‌ అయిన వారే గాకుండా కొత్తగా ప్రైవేటు స్కూళ్ల నుంచి హాజరవుతున్న వారే అధికంగా ఉన్నారని చెబుతున్నారు. ఇంకా పాఠశాలలు తెరవక ముందే 2, 4, 5, 7వ తరగతి లలో గత ఏడాదికంటే సంఖ్య పెరిగింది. తెరిచాక కనీసం మరో 60 వేలకు పెరగవచ్చని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.  

అంగీకారపత్రం డ్రాప్‌బాక్స్‌లో నమోదు చేయాలి 
జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చే విద్యార్థులను చేర్చుకోవడంలో వచ్చిన సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చైల్డ్‌ఇన్ఫో నమోదును వచ్చే నెల 2వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు తక్షణమే అప్‌లోడ్‌ చేయాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు టీసీలు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకొని చైల్డ్‌ఇన్ఫోలోని డ్రాప్‌ బాక్స్‌లో ఎంఈఓలు వేయాలి. 
– జి.నాగమణి, డీఈఓ 

మరిన్ని వార్తలు