కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌

18 Sep, 2020 08:38 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీ (ఫైల్‌ ఫోటో)

సర్వే, ఇన్వెస్టిగేషన్, భూసేకరణకు రూ.204.37 కోట్లు మంజూరు

సాక్షి, అమరావతి : కృష్ణా డెల్టాకు జవసత్వాలు కల్పిస్తూ ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ. దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య ఒక బ్యారేజీ నిర్మాణం కానుండగా, 62 కి.మీ. దిగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్య మరో బ్యారేజీని నిర్మించనున్నారు. ఇందుకోసం సర్వే, ఇన్వెస్టిగేషన్‌ పనులు, భూసేకరణకు రూ.204.37 కోట్లను మంజూరు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యద్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం తొలిదశ పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు.  (కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా) 

కృష్ణమ్మ పరవళ్లు
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 3,38,823 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటంతో పది గేట్లు ఎత్తి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 4,12,345 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 2,28,991  క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి చేరుతుంది. 

నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ 18 గేట్లు ఎత్తి, విద్యుత్కేంద్రం ద్వారా 3,48,518 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి వదులుతున్న వరదలో 3,35,858 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతుండగా.. అంతే పరిమాణంలో 14 గేట్లు ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు మున్నేరు, కట్టలేరు, వైరా, కొండవీటివాగు, కొండవాగుల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 3,61,268 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు 4,829 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 70 గేట్లను ఎత్తేసి 3,79,389 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. సోమశిల ప్రాజెక్టులోకి 69,888 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 76 టీఎంసీలకు చేరుకుంది. కండలేరులోకి 10,459 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 38.50 టీఎంసీలకు చేరుకుంది.

మరిన్ని వార్తలు