విజయవాడ–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి పచ్చజెండా

16 May, 2022 10:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

   రూ.14 వేల కోట్లతో నిర్మాణం 

సాక్షి, అమరావతి: ఏపీ నుంచి మరో జాతీయ రహదారి మహారాష్ట్రను అనుసంధానించనుంది. విజయవాడ–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కార్యాచరణకు ఉపక్రమించింది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్‌–బ్రౌన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించనున్నారు. రూ.14 వేల కోట్లతో మొత్తం 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించే ప్రణాళికను ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించింది.
చదవండి: AP: ఎగుమతులపై ‘పుష్‌’ పాలసీ

ఈమేరకు ఫీజబులిటీ నివేదిక, డీపీఆర్‌లను ఖరారు చేసింది. విజయవాడ–నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను అయిదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. వాటిలో విజయవాడ–ఖమ్మం, ఖమ్మం–వరంగల్, వరంగల్‌–మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలుగా.. మంచిర్యాల–రేపల్లెవాడ, రేపల్లెవాడ–చంద్రాపూర్‌ ప్యాకేజీలను బ్రౌన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలుగా నిర్మించాలని నిర్ణయించారు. చంద్రాపూర్‌ నుంచి నాగ్‌పూర్‌కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేకి ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం మీద 310 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్, 147 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రూపుదిద్దుకోనుంది.

తగ్గనున్న వ్యయ, ప్రయాసలు
ఈ హైవేతో విజయవాడ–నాగ్‌పూర్‌ మధ్య ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు బాగా తగ్గుతాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి నాగ్‌పూర్‌ వెళ్లాలంటే హైదరాబాద్, అదిలాబాద్‌ మీదుగా 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 13 గంటల సమయం పడుతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు.

దీంతో విజయవాడ–నాగ్‌పూర్‌ మధ్య దూరం 163 కిలోమీటర్లు తగ్గి ఐదుగంటల సమయం కలసివస్తుంది. ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం కావడంతో భూసేకరణ ప్రక్రియపై ఎన్‌హెచ్‌ఏఐ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు వేగవంతం చేసింది. విజయవాడ రూరల్, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు 1.65 లక్షల చదరపు మీటర్ల భూసేకరణకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 2025నాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం పూర్తిచేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు