ఇంటర్‌ విద్యార్థినితో ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. వివాహం రోజే!

24 May, 2022 14:54 IST|Sakshi
గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తున్న వధువు బంధువులు 

సాక్షి, గుంటూరు: పెళ్లి పందిరి నిరసనలకు వేదికగా మారింది. పెళ్లి కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేయటంతో వివాహం రద్దు అయ్యింది. కట్నం కింద ఇచ్చిన నగదు ఇవ్వాలని వధువు కుటుంబసభ్యులు, బంధువులు పట్టుబట్టడంతో వివాదం జరిగింది. పెళ్లి కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ ముట్లూరు రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం పవన్‌కుమార్‌కు చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది. కట్నం కింద కొంత డబ్బులు ఇచ్చారు. సోమవారం వివాహం జరగాల్సి ఉంది.

పవన్‌కుమార్‌ ఇదేప్రాంతానికి చెందిన ఇంటర్‌ విద్యార్థినిని ప్రేమించాడు. వీరి వివాహానికి యువకుని తల్లిదండ్రులు నిరాకరించారు. సోమవారం వివాహం జరుగుతుందని తెలిసిన ప్రేమికురాలు పవన్‌ను నిలదీసింది. మూడు రోజుల కిందట కళాశాల వద్దకు వస్తానని చెప్పిన యువకుడు రాకపోవటంతో మనస్థాపానికి చెందిన యువతి కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాయాలతో బయటపడిన విద్యార్థిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. మోసం చేసిన పవన్‌కుమార్‌ను నల్లపాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది.

విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు సోమవారం మధ్యా హ్నం పాతరెడ్డిపాలెం వచ్చారు. కట్నం కింద ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని, ఆడపిల్లకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ముట్లూరు రోడ్డులో ఎండలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు చెందిన వారితో మాట్లాడి పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులు ఇచ్చిన డబ్బులు చెల్లించటానికి అంగీకరించటంతో సమస్య పరిష్కారమైంది. ఎస్‌ఐ వై సత్యనారాయణ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.  
చదవండి: దొంగనోట్లు మారుస్తూ పట్టుబడిన భార్యాభర్తలు

మరిన్ని వార్తలు