కరోనా సోకిందంటూ వరుడి అదృశ్యం

8 Aug, 2020 07:18 IST|Sakshi
పరారైన వరుడు రామ్‌కుమార్‌

చెన్నేకొత్తపల్లి: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు ఫోను ద్వారా చెప్పి వివాహానికి బ్రేక్‌ పడేలా చేసిన ఘటన శుక్రవారం రాత్రి మండలంలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకి చెందిన నరసింహులు, నరసమ్మల పెద్ద కుమారుడు రామ్‌కుమార్‌ (రాముడు)కి కొత్తచెరువు మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది.

వీరి వివాహం శనివారం రాత్రి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి ఇష్టంలేని రామ్‌కుమార్‌ ఇంటి నుంచి శుక్రవారం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అనంతరం తనకు కరోనా వ్యాధి సోకిందని, తనను అనంతపురం నారాయణ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారని బంధువులు, మిత్రులకు ఫోన్‌ ద్వారా తెలిపాడు. అయితే ఇదే విషయమై అధికారులను వివరణ కోరగా రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని తాము ఎక్కడికి తీసుకెళ్లలేదని వైద్యాధికారులు తెలిపారు. పెళ్లి ఇష్టంలేకనే వరుడు నాటకానికి తెరతీసినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు