గోదారోళ్లా మజాకా.. సారె కింద ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు

13 Aug, 2021 16:42 IST|Sakshi

శ్రావణ సారె.. మామగారికి 10 టన్నుల స్వీట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరలవుతోన్న శ్రావణ, ఆషాఢసారెలు

సాక్షి, తూర్పుగోదావరి: సాధారణంగా ఆడపిల్లకు పుట్టింటి నుంచి సారె పంపడం ఆనవాయితీ. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో ఆషాడం, శ్రావణం సారె కావిళ్లు ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటి. ఈ క్రమంలో గత నెలలో యానంలో అల్లుడికి మామగారు పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్‌కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది. 

ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్‌ కుమార్‌ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్‌ కుమార్‌ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు.

ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్‌ కుమార్‌. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. 

మరిన్ని వార్తలు