ఊపిరాడట్లే.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు!

8 Oct, 2021 09:35 IST|Sakshi

జిల్లాలోని పట్టణాల్లో పెరుగుతున్న భూస్థాయి ఓజోన్‌ మోతాదు

కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో మరీ అధికం

శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): ట్రాఫిక్‌ రద్దీ.. వాహనాల పొగతో జిల్లాలోని పట్టణాల్లో భూస్థాయి ఓజోన్‌ మోతాదు అంతకంతకూ అధికమవుతోంది. ఫలితంగా వివిధ వ్యాధిగ్రస్తులు, సీనియర్‌ సిటిజన్లు అస్తమా, బ్రాంకైటీస్‌ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్నకాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్‌ వాయువులు సీనియర్‌ సిటిజన్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి.

ప్రధానంగా ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి 9 రాత్రి గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్‌ వాయువు గాలిలోని నైట్రోజన్‌ అక్సైడ్‌ , ఓలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్‌లతో కలసిపోవడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్‌ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకున్న ప్రయాణీకులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్‌ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉన్నసమయాల్లో సుమారు ఘనపు మీటరు గాలిలో 125 మైక్రో గ్రాములుగా నమోదు అవుతుండడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి.

 అనర్థాలిలా..
–అస్తమా, ట్రాకంఐటిస్‌తో సతమతమవడం, ఊపిరిఆడకపోవడం
– గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం
– ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం

ఉపశమనం ఇలా...
కర్నూలు,నంద్యాల, ఆదోనిలతోపాటు ఇతర పట్టణాల్లో సుమారు 20 లక్షల వాహనాల్లో పదిహేనేళ్లకు పైబడిన 5లక్షల వాహనాలను రోడ్డు ఎక్కకుండా చూడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్కులు, హెల్మెట్‌లు ధరించాలి. వాము కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో కలిగే దుష్ప్రభావాలను కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగిస్తే కొంత మేర నివారించే అవకాశం ఉంది. 

ప్రజల్లోమార్పు రావాలి
రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో కొన్నింటిని కాలం చెల్లినా వినియోగిస్తున్నారు. ఇవి పర్యావరణానికి ఎంతో కీడు చేస్తాయి. అవి విడుదల చేసే వాయువులు, ఓజోన్‌ కలసి భూ వాతావరణాన్ని వేడెక్కిస్తుండడంతో ప్రమాదం దాపురిస్తోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. ప్రజల్లో అవగాహన వస్తే తప్పా ఏమి చేయలేము.  -బీవై మునిప్రసాదు, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్‌ అధికారి, కర్నూలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు