పాతాళగంగ ఉప్పొం'గంగ'

8 Feb, 2022 05:42 IST|Sakshi
రాజుపాలెం గ్రామంలో బోరు బావుల నుంచి వచ్చే నీటి పరిమాణాన్ని కొలుస్తున్న భూగర్భ జల అధికారులు, రైతులు

గుంటూరు జిల్లాలోని 34 మండలాల్లో 3 మీటర్లలోపే భూగర్భ జలసిరి

పల్నాడులో గణనీయంగా పెరుగుదల  

అన్ని డివిజన్లలోనూ నీటిమట్టాలు పైపైకి..  

గత ఆరునెలల్లో భూగర్భానికి 30.02 టీఎంసీల నీరు 

జిల్లా సగటు అధిక వర్షపాతం 9.94 శాతంగా నమోదు

గురజాల డివిజన్‌లోని బొల్లాపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లో గత ఏడాది మేనెలలో భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి.  గతేడాది జనవరి, మే నెలల్లో డివిజన్‌ సరాసరి భూగర్భ జల మట్టాలు వరుసగా 11.10, 13.27 మీటర్లుగా నమోదయ్యాయి.  అనంతరం జూన్‌ నుంచి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత ఆరునెలల కాలంలో సాధారణంగా 666.68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 808.93 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది సాధారణం కన్నా 21.33 శాతం అధికం. ప్రస్తుతం గురజాల డివిజన్‌లో భూగర్భ జలాలు 7.58 మీటర్లకు ఎగబాకాయి. అంటే మేనెలతో పోలిస్తే 5.69 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి ’’. 

సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో పాతాళ గంగ పైపైకి ఎగబాకుతోంది. చుక్క నీరు కూడా లేక ఎండిన పోయిన బోర్లు నిండైన నీటి ధారతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం, కృష్ణానదికి వరుసగా వరదలు రావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్లలోనూ భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. కరువుసీమ పల్నాడులోనూ జలసిరులు ఉబికివస్తున్నాయి. ఫలితంగా సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.

గత మే నెలతో పోలిస్తే.. 
జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే 2.89 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గత మే నెలలో జిల్లాలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.07 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 5.18 మీటర్లకు భూగర్భ జలాలు ఎగబాకాయి. ప్రస్తుతం న్యూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామంలో 0.31 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. గురజాల డివిజన్‌లోని వెల్దుర్తి గ్రామంలో 46.24 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది.  జిల్లాలో 57 మండలాలు ఉండగా, 34 మండలాల్లో 0 నుంచి 3 మీటర్లలోపు, 18 మండలాల్లో 3 నుంచి 8మీటర్లలోపు, రెండు మండలాల్లో 8 నుంచి 15 మీటర్లలోపు, మూడు మండలాల్లో 15 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరు అందుబాటులో ఉంది. నీటికి కటకటలాడే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లోనూ భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందడం విశేషం. ఈ మండలాల్లో ఏప్రిల్‌ వరకు బోర్లలో నీరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉండటంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం ఒక మీటరు లోతులోపే భూగర్భజలాలు లభ్యమవుతుండడం గమనార్హం.
 గురజాల మండలం చర్లగుడిపాడులో ఓ వ్యవసాయ బోరు నుంచి మోటారు పెట్టకముందే నీరు బయటకు వస్తున్న దృశ్యం (ఫైల్‌) 

భూగర్భంలోకి 30.02 టీఎంసీలు 
గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు సగటు సాధారణ వర్షపాతం 746.08 మిల్లీమీటర్లుగా నమోదుకాగా, 820.31 మిల్లీమీటర్ల వాన కురిసింది. అంటే 9.94 శాతం అధిక సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గురజాల డివిజన్‌లో 21.33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల 333.57 టీఎంసీల నీరు జిల్లా భూమిపైకి చేరగా, అందులో 30.02 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది.  

ప్రభుత్వ చర్యల వల్లే మార్పు
ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత పనులు అధికమొత్తంలో చేపట్టడం సత్ఫలితాలనిస్తోందని పేర్కొంటున్నారు. ప్రజలు మరింత చైతన్యంతో వ్యవహరించి ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వితే.. ఇంకా మంచి ఫలితాలు వస్తాయని, జిల్లాలో నీటికి కొదవ ఉండదని అధికారులు సూచిస్తున్నారు.  

నీటి మట్టాలు పెరిగాయి
గతంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు  పెరిగాయి. దీంతో బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. తాగు, సాగునీటి సమస్య తీరింది. బోరు నుంచి ప్రస్తుతం సమృద్ధిగా నీరువస్తోంది. ఐదెకరాల్లో మిరప, శనగ పంట సాగుచేశా. ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. 
– తవనం వెంగళరెడ్డి, రైతు, రెమిడిచర్ల గ్రామం, బొల్లాపల్లి మండలం

పొదుపుగా వాడుకోవాలి 
వర్షాలు అధికంగా నమోదు కావడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. సాధారణ వర్షపాతం కన్నా 9.94 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి.  గత ఆరు నెలల కాలంలో 30 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. జిల్లాలో 34 మండలాల్లో 3 మీటర్ల కన్నా లోపే భూగర్భ జలాలు లభిస్తున్నాయి.  రైతులు జలాలను పొదుపుగా వాడుకోవాలి. 
– బి నాగరాజు, ఇన్‌చార్జ్‌ డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, గుంటూరు 

మరిన్ని వార్తలు