గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు 14 నుంచి యథాతథం

10 Dec, 2020 03:43 IST|Sakshi

ఏపీపీఎస్సీ స్పష్టీకరణ.. మెయిన్స్‌కు 9,678 మంది

ఈసారి ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రం పంపిణీ

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి యథాతథంగా జరగనున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు బుధవారం స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు రోజూ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు మొత్తం 9,678 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షలను నవంబర్‌ 2 నుంచి 13 వరకు నిర్వహించేలా ఏపీపీఎస్సీ ఇంతకు ముందు షెడ్యూల్‌ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం ఏపీపీఎస్సీ వాటిని పునః పరిశీలన చేయించింది. ఈ పరిశీలన అనంతరం కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్‌ రాసేందుకు అవకాశం ఇచ్చింది.

సింగిల్‌ జడ్జి తీర్పుపై జోక్యానికి నిరాకరణ
ఐదు ప్రశ్నలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులకు నివేదించి, సరైన జవాబులను పరిశీలించి, వాటి ఆధారంగా తిరిగి మెరిట్‌ జాబితాను తయారు చేయాలని ఏపీపీఎస్‌సీని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యానికి నిరాకరించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ కొందరు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ప్రశ్నలు, జవాబుల ప్రామాణికతను తేల్చాల్సింది నిపుణులే తప్ప, న్యాయస్థానాలు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. 

ట్యాబ్‌బేస్డ్‌ విధానంపై డెమో వీడియో
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలను పంపిణీ చేయనున్నారు. అభ్యర్థులకు ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ (ఎలక్ట్రానిక్‌ డివైస్‌) ద్వారా ఇస్తారు. ఇది తెలుగు, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. అభ్యర్థులు క్వాలిఫయింగ్‌ పేపర్లయిన తెలుగు, ఇంగ్లిష్‌ మినహా మిగతా పేపర్లకు సమాధానాలను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలలో వారు ఎంచుకున్న భాషలో రాయవచ్చు. పరీక్ష పూర్తయిన అనంతరం అభ్యర్థులు ఆన్సర్‌ బుక్‌ను, ట్యాబ్‌ను తాము కూర్చున్న టేబుల్‌పై ఉంచడమో, లేదా ఇన్విజిలేటర్‌కు అందించడమో చేయాలి. వాటిని ఎవరూ బయటకు తీసుకువెళ్లరాదు. ట్యాబ్‌బేస్డ్‌ పరీక్ష విధానంపై డెమో వీడియో కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచారు. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 

మరిన్ని వార్తలు