రోజూ సైకిల్‌పై 18 కి.మీ. పయనం: గ్రూప్‌–2 విజేత

7 Jan, 2021 09:07 IST|Sakshi
గ్రూప్‌–2 విజేత దాసి చిన్నబ్బులుకు స్వీటు తినిపిస్తున్న తల్లి వెంకటలక్ష్మి, తండ్రి దేవదానం

 గ్రూప్‌–1 సాధించడమే లక్ష్యం

చదువుంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే

సాక్షి, రాజమహేంద్రవరం రూరల్‌: నాన్న చిరుద్యోగి.. ఆయన ప్రోత్సాహంతో ఎంత కష్టమైన 18 కిలోమీటర్లు రోజూ రాజమహేంద్రవరం వెళ్లి చదువుకున్నా.. ఇంటిలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు లేరని నాన్న అన్న మాట తనలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పాన్ని దృఢపరిచింది. సచివాలయ సెక్రటరీ ఉద్యోగం వచ్చినా, ఇప్పుడు గ్రూప్‌–2లో ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్డీగా విజయం సాధించగలిగినా నాన్న మాటలే స్ఫూర్తి అని అన్నారు రాయుడుపాకలు గ్రామానికి చెందిన దాసి చిన్నబ్బులు.

రాయుడుపాకలు గ్రామానికి  చెందిన ఒక ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా పనిచేసే దాసి దేవదానం, వెంకటలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నవాడైన చిన్నబ్బులు పదో తరగతి పాలచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ నుంచి ఎంఎస్సీ(ఆర్గానిక్‌), బీఎడ్‌ వరకు రాజమహేంద్రవరంలోనే చదివాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నిత్యం 18 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి వచ్చేవాడు. మన ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ లేరని తండ్రి దేవదానం అన్నమాట అతనికి స్ఫూర్తినిచ్చింది. దాంతో 2015 నుంచి గ్రూప్స్‌లో విజయం సాధించాలని కృషి చేశాడు. 2017లో జరిగిన గ్రూప్‌–2 పరీక్షల్లో రెండు మార్కుల తేడాతో అర్హత కోల్పోయాడు. అప్పుడు చాలామంది నీకు ఉద్యోగం రాదులే అని నిరుత్సాహపరిచారు.

ఆ సమయంలో తండ్రి ప్రోత్సాహంతో 2019లో గ్రూప్‌–2, గ్రూప్‌–3లతో పాటు సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్లు అన్నీ ఒకేసారి వచ్చినప్పటికీ పక్కా ప్రణాళికతో నిబద్ధతతో చదివి పరీక్షలు రాసి విజయం సాధించాడు. వార్డు సచివాలయంలో శానిటేషన్‌ అసిస్టెంట్, గ్రేడ్‌–5 సచివాలయ సెక్రటరీ ఉద్యోగాలు వచ్చాయి. దీంతో కాతేరు గ్రామ సచివాలయం–2 సెక్రటరీగా విధుల్లో చేరారు. ఆ తరువాత గ్రూప్‌–3లో గ్రేడ్‌–4 పంచాతీ కార్యదర్శిగా ఉద్యోగం వస్తే వెళ్లలేదు. ఆ తరువాత గ్రూప్‌–2 పరీక్షల్లోను, ప్రిలిమినరీ, ఫైనల్‌ పరీక్షల్లో విజయం సాధించడంతో ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్డీగా ఉద్యోగానికి నియమితుడయ్యాడు. తనకు గ్రూప్‌–1 సాధించడమే లక్ష్యమని దాసి చిన్నబ్బులు ఘంటాపథంగా చెబుతున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు