రాష్ట్రంలో పంజాబ్‌ పాత్రికేయుల బృందం పర్యటన

4 Sep, 2022 05:10 IST|Sakshi
పంజాబ్‌ పాత్రికేయులతో ఏపీ టూరిజం అధికారులు

పలు పర్యాటక ప్రాంతాల సందర్శన

రాష్ట్ర టూరిజం ప్రాజెక్టులను వివరించిన అధికారులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు పంజాబ్‌కు చెందిన పాత్రికేయుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్నబాబు తెలిపారు. ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా గత నెల 31 న రాష్ట్రానికి వచ్చిన ఈ బృందం ఈ నెల 6వ తేదీ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) జలంధర్‌ శాఖ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం తొలుత విశాఖలోని పర్యాటక ప్రదేశాలను, డిండిని సందర్శించిందన్నారు.

శనివారం విజయవాడ బెర్మ్‌ పార్కులో ఈ బృందానికి రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టుల గురించి వివరించినట్టు చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, కళలు, వారసత్వ సంపదను పంజాబ్‌లో ప్రచారం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, నిత్యం ప్రవహించే నదులు, సుందరమైన బ్యాక్‌ వాటర్స్, కొండలు, అడవులు, పురాతన దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు మన సంస్కృతి, వారసత్వాలను చాటిచెబుతాయన్నారు. పీఐబీ జలంధర్‌ నోడల్‌ అధికారి రాజేష్‌ బాలి మాట్లాడుతూ..ఏపీలోని  పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, అలవాట్లు మంచి విజ్ఞానాన్ని అందించాయని చెప్పారు.

మరిన్ని వార్తలు