ఇరవై పైసలకే కిలోమీటర్‌.. ఈ బండి చాలా మేలండి

30 Jul, 2021 18:20 IST|Sakshi

పెరుగుతున్న పెట్రోల్‌  ధరకు ప్రత్యామ్నాయం 

5 గంటల చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల ప్రయాణం

ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ 

విజయనగరం: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు వాహనదారులకు భారంగా మారాయి. బండి బయటకు తీయాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఆశా కిరణంలా కనిపిస్తున్నాయి. వాటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడంతో పాటు కాలుష్య నియంత్రణ సాధ్యమతోంది. వాటి వినియోగాన్ని పెంచితే ఖర్చు తగ్గడంతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతుండగా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు నెడ్‌క్యాప్‌ ద్వారా సులభ వాయిదాల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఇప్పించే చర్యలు ప్రారంభించాయి.

ఇరవై పైసలకే కిలోమీటరు 
నగరంలో ఇటీవల వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్‌ తర్వాత చాలా మంది ప్రజారవాణా కంటే సొంత వాహనాలపై వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. సులభమైన వాయిదా పద్ధతులు ఇందుకు దోహదపడుతున్నాయి. ఫలితంగా రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. రద్దీ సమయాల్లో కొన్ని ముఖ్య కూడళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుండగా..ఇవన్నీ పెట్రోల్, డీజిల్‌తో నడిచేవి కావడంతో కాలుష్యం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగం పెరిగితే.. కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం విజయనగరంలో పెట్రోల్‌ ధర లీటరు రూ.106గా ఉంది. ఈ లెక్కన పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనానికి కి.మీ.కు రూ.2.50 ఖర్చవుతుంది. అదే విద్యుత్తు బైక్‌కు కేవలం 20 పైసలు మాత్రమే. కేవలం 4 యాంప్‌ సాకెట్‌ ఉంటే ఇంట్లోనే చార్జింగ్‌ పెట్టుకోవచ్చు ఈ తరహా బండ్లకు చార్జింగ్‌ స్టేషన్లూ రానున్నాయి.  ఆ దిశగా  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వే వెంబడి అవి ఏర్పాటు కానున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు.. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వాటిని అందించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.  నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో అందరికీ సులభ వాయిదాల్లో అందించనున్నారు. ఈ ద్విచక్ర వాహనాల వేగం 45 నుంచి 55 కి.మీ. ఉంటుంది. ఒకసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే 80 నుంచి 100 కి.మీ. నడుస్తుంది. ఫుల్‌ చార్జింగ్‌కు మూడు యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుంది. వాహన మోడల్, ధరను బట్టి నెలకు రూ.2వేల నుంచి రూ.2,500 చొప్పున 60 నెలలు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఇవ్వనున్నారు.  

రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ అవసరం లేదు  
బ్యాటరీ వాహనాల కొనుగోలుపై యువత, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్‌ తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. సెంట్రల్‌ మోటర్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం 25కి.మీ కంటే తక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, రోడ్‌ ట్యాక్స్‌ అవసరం లేదు. కొనుగోలు చేసిన బండిని వెంటనే వినియోగించవచ్చు. ప్రస్తుతం లిథియం బ్యాటరీలు వస్తున్నాయి. అవి ఎక్కువ కాలం మన్నుతాయి. 5గంటలు చార్జింగ్‌ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.  
– పి.శ్రీనివాసరావు, మెకానిక్, విజయనగరం

మరిన్ని వార్తలు