దూసుకెళ్తున్న విమానం

21 Apr, 2022 03:52 IST|Sakshi
విజయవాడ విమానాశ్రయ టెర్మినల్‌లో ప్రయాణికుల సందడి

కరోనా తరువాత మారిన పరిస్థితి

విజయవాడ విమానాశ్రయానికి పెరుగుతున్న డిమాండ్‌

రోజుకు 2,500 మందికి పైగా ప్రయాణికులు

90 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తున్న సర్వీసులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విమాన ప్రయాణం వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతున్నారు. కోవిడ్‌ సమయంలో పూర్తిగా వెనక్కి తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కళకళలాడుతోంది. నెలరోజులుగా 90–95 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. దీంతో విమానయాన సంస్థలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రోజుకు 2,500 మందికిపైగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. 

దేశీయ విమాన సర్వీసులివే..
కరోనా పరిస్థితుల్లో వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కొన్ని విమాన సర్వీసులు మాత్రమే నడిచాయి. గతంలో విజయవాడ విమానాశ్రయం నుంచి 36 విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవి. కరోనా పరిస్థితులు క్రమంగా కనుమరుగవుతుండటం, వేసవి సీజన్‌ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే విమానాల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా ప్రస్తుతం 18 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌కి ఏడు, బెంగళూరుకి ఐదు, చెన్నైకి రెండు, విశాఖపట్నం, ఢిల్లీ, తిరుపతి, కడపలకు ఒక్కొక్క సర్వీసు నడుస్తున్నాయి. చెన్నై వెళ్లే విమాన సర్వీసుల్లో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, కడప, ఢిల్లీ విమాన సర్వీసులు 93 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే మరిన్ని సర్వీసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ సర్వీసులివే..
విజయవాడ విమానాశ్రయం నుంచి మూడు అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ నుంచి మస్కట్, కువైట్, షార్జాలకు విమాన సర్వీసులున్నాయి. ఈ నడిచే సర్వీసుల్లో సైతం 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంటోంది.

త్వరలో కొత్త సర్వీసులు
విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో మరిన్ని సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి ముంబైకి, తిరుపతికి వారంలో నాలుగు రోజులు మాత్రమే విమాన సర్వీసు ఉంది. దీన్ని రోజు రెగ్యులర్‌గా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం ఢిల్లీ వెళ్లే సర్వీసు సాంకేతిక సమస్యతో  ప్రస్తుతం నడవటం లేదు. త్వరలో దాన్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. 

ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.
విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడినుంచి నడిచే విమాన సర్వీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వేసవి కావడంతో విమాన ప్రయాణానికి డిమాండ్‌ పెరిగింది. త్వరలో విజయవాడ విమానాశ్రయం నుంచి మరిన్ని కొత్త సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– పి.వి.రామారావు, ఏపీడీ, గన్నవరం 

మరిన్ని వార్తలు