మిల్లెట్స్‌.. హెల్త్‌ బుల్లెట్స్‌

16 Dec, 2022 11:22 IST|Sakshi

త్రుణధాన్యాలకు పెరుగుతున్న ఆదరణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 వేల ఎకరాల్లోసాగు చేపట్టిన 5 వేల రైతు కుటుంబాలు

ఐఐఎంఆర్‌ నుంచి నాణ్యమైన సీడ్‌

పంట ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి వాక్యూమ్‌

ప్యాకెట్లలో విక్రయిస్తున్న వ్యాపారులు

ఆరోగ్యంపై అవగాహనతో  ప్రజల మెనూలో మార్పు

తక్కువ ఖర్చుతో రైతులకు నికరాదాయం 

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది జగద్విదితం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్య పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. మన దేశంలో దశాబ్దాలుగా వరినే ప్రధాన ఆహారంగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల సుగర్, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయని వైద్యుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తాము తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకుంటున్నారు. త్రుణ/చిరుధాన్యాల (మిల్లెట్స్‌)ను తీసుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. 
– సాక్షి, కర్నూలు డెస్క్‌

త్రుణధాన్యాలు అంటే.. 
త్రుణధాన్యాల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు. భారతదేశంలో రైతులు దాదాపు ఐదు వేల సంవత్సరాలుగా వీటిని సాగు చేస్తున్నారు. ఇవి తక్కువ కాలవ్యవధి పంటలు. అంటే విత్తిన రెండు నెలలకు పంట చేతికి వస్తుంది. పైగా వర్షాధారితం. ఒక్కసారి తగినంత వర్షం కురిస్తే చాలు పంట పండినట్లే. వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారిరక్తంలో కలిసిపోకుండా అవసరమైన మేరకు మాత్రమే కొద్దికొద్దిగా రక్తంలో కలుస్తుంది. 

గ్రీన్‌ రివల్యూషన్‌ ప్రభావం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకు చిరుధాన్యాలను ఎక్కువ విస్తీర్ణంలోనే రైతులు సాగుచేసేవారు. అయితే, 1960 –70 దశకంలో భారతదేశంలో వ్యవసాయ విప్లవం (గ్రీన్‌ రివల్యూషన్‌) వచ్చిన తరువాత వరి, గోధుమ ప్రధాన ఆహార పంటలుగా మారిపోయాయి. ఎక్కువ దిగుబడి రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు రైతులందరూ వరినే సాగు చేయడం ప్రారంభించారు. బియ్యంలో పీచు పదార్థం లేకపోవడంతో చాలా సంవత్సరాలుగా వాటిని ఆహారంగా తీసుకుంటున్న ప్రజలు అనారోగ్యాలకు గురయ్యారు. వైద్యుల పరిశోధనల్లో వెల్లడవుతున్న విషయాలపై అవగాహనకు వచ్చిన ప్రజలు ప్రస్తుతం తమ ఆహార అలవాట్లు మార్చుకుంటూ త్రుణధాన్యాలను తీసుకుంటున్నారు.  

జిల్లాలో చిరుధాన్యాల సాగు 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం దాదాపు ఐదు వేల మంది రైతులు 12 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో విత్తనం వేసుకుంటే ఒక్క వర్షానికే పంట చేతికి వస్తుంది. రెండు నెలల్లోనే దిగుబడులు వస్తున్నందున మళ్లీ రెండో పంట కూడా వేసుకునేందుకు వీలవుతోంది. జొన్నలు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. కొర్రలు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్లు వరకు వస్తోంది. ఖర్చు తక్కువ కావడం పంట ఉత్పత్తులకు మార్కెట్‌ ఉండటంతో రైతులు వాటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా తమ ఆహారంలో మిల్లెట్స్‌కు చోటివ్వడంతో వినియోగం పెరిగి మార్కెట్‌లో వాటికి డిమాండ్‌ ఏర్పడింది. అండుకొర్రలు కిలో రూ.55, కొర్రలు రూ.32, అరికెలు రూ.30 ధరలు పలుకుతున్నాయి. మార్కెట్‌ తీరుతెన్నులను గమనించిన కొందరు రైతులు త్రుణధాన్యాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పందిపాడుకు చెందిన రైతు కె.వేణుబాబు ఏకంగా 37 ఎకరాల్లో మిల్లెట్స్‌ను పండిస్తున్నారు. 

రైతులకు లాభసాటి 
చిరుధాన్యాల సాగు ప్రస్తుతం రైతులకు లాభసాటిగా మారింది. హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌) నాణ్యమైన చిరుధాన్యాల సీడ్స్‌ విక్రయిస్తోంది. జిల్లాలో సాగు రైతులు ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు. చిరుధాన్యాలు సాగుచేసే కొందరు రైతులు సంఘాలుగా ఏర్పడి సీడ్స్‌ రైతులకు సరఫరా చేస్తూ.. పంట ఉత్పత్తులను కూడా వారే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సీడ్స్‌ ఇచ్చే సమయంలోనే పంట ఉత్పత్తులను నిర్ణీత ధరకు కొనుగోలు చేసేలా బైబ్యాక్‌ ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో అటు రైతులకు ఇటు సీడ్‌ వ్యాపారులకు లాభాలు చేతికి దక్కుతున్నాయి. కర్నూలులోని ‘ఆంధ్రప్రదేశ్‌ విత్తన రైతు సేవా సంఘం’ ఒక్కటే దాదాపు నెలకు ఐదు టన్నుల వరకు ప్రాసెస్‌ చేసిన సిరిధాన్యాలను వినియోగదారులకు విక్రయిస్తున్నదంటే మార్కెట్‌లో వాటికి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. 

డిమాండ్‌ పెరుగుదలకు కారణాలు 
త్రుణధాన్యాలు ఆహారంగా తీసుకునే వారికి ఆరోగ్యపరంగా పలు ఉపయోగాలున్నాయని డాక్టర్‌ ఖాదర్‌వలీ, ప్రకృతివనం ప్రసాద్‌ వంటి వారు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలు కూడా సహజంగానే ఆరోగ్య విషయాలపై అవగాహన పెంచుకుని మెనూలో మార్పులు చేసుకుంటున్నారు. మిల్లెట్స్‌లో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు పీచుపదార్థం ఉంటుంది. పీచుపదార్థం వల్ల తిన్న ఆహారం కొద్దికొద్దిగా మాత్రమే గ్లూకోజ్‌గా మారుతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్‌ పెద్ద మొత్తంలో ఒకేసారి చేరదు కాబట్టి సుగర్, బీపీ అదుపులో ఉంటాయి. సుగర్‌ అదుపులో ఉన్నందున ఊబకాయం రాదు. అందువల్లే వీటిని తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. 

37 ఎకరాల్లో త్రుణధాన్యాల సాగు 
ఈ చిత్రంలోని రైతు పేరు కె.వేణుబాబు. కర్నూలు వాసి. గతంలో వాణిజ్యపరంగా పత్తి సాగు చేసేవారు. గత కొద్ది సంవత్సరాలుగా కల్లూరు మండలం పందిపాడులో  తనకున్న పొలంతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని త్రుణధాన్యాలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం 37 ఎకరాలలో త్రుణధాన్యాలు సాగు చేశారు. ఆహారం విషయంలో ప్రజలు చైతన్యవంతులవుతున్నారని, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు అలవాటు పడుతున్నందున వాటికి డిమాండ్‌ ఏర్పడినందున వాటినే సాగు చేశానని చెప్పారు. ఖరీఫ్‌ ప్రారంభంలో వేసిన పంట రెండు నెలల్లో చేతికి వస్తున్నందున రెండో పంట సాగుకు కూడా వీలుంటుందని అంటున్నారు. 

ఎకరాకు 10 క్వింటాళ్ల రాగుల దిగుబడి 
ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు అల్వాల బాలయ్య. నందికొట్కూరు పట్టణానికి చెందినవారు. కొన్నేళ్లుగా చిరుధాన్యాల సాగులో రాణిస్తున్నారు. ఈ ఏడాది కూడా 3 ఎకరాల్లో సామలు, 2 ఎకరాల్లో రాగులు సాగు చేశారు. సామలు 6, రాగులు 10 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. సామలు క్వింటా రూ.3000 చొప్పున విక్రయించారు. తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం పొందుతున్నారు. సాగు చేయడమే కాదు... చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు