‘సొంతూరు నుంచే పని’కి పెరుగుతున్న ఆదరణ

7 Jan, 2022 10:06 IST|Sakshi

థర్డ్‌ వేవ్‌తో డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీలో భాగస్వామ్యం కావడానికి ఐటీ సంస్థల ఆసక్తి

డిమాండ్‌కు అనుగుణంగా అదనపు సెంటర్ల ఏర్పాటు

త్వరలోనే 100 కేంద్రాల ఏర్పాటు

కనీసం లక్ష మందిని రాష్ట్రం నుంచి పనిచేయించడమే లక్ష్యం

సాక్షి, అమరావతి: కరోనా సమయంలో ఉద్యోగులు సొంత ఊరు నుంచి పని చేసుకొనేలా దేశంలోనే తొలిసారిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ) విధానానికి ఆదరణ పెరుగుతోంది. ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మూడో వేవ్‌ ప్రారంభమవడంతో కంపెనీలు తిరిగి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు మొగ్గు చూపుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీలో భాగస్వామ్యం కావడానికి అనేక ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్‌ ‘సాక్షి’కి తెలిపారు. గత నెలలో పైలెట్‌ ప్రాజెక్టు 29 కేంద్రాల్లో 1,500 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు 25కి పైగా కంపెనీలు డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. 

దీంతో డిమాండ్‌ ఏకంగా 3,000 సీట్లకు పెరిగిందని వెంకట్‌ తెలిపారు. త్వరలోనే 100 కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో భాగస్వామ్యం కావాలని 1,000కు పైగా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన రెండు లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్టీ సర్వేలో వెల్లడయింది.

వీరు సొంత ఊరు నుంచే పని చేసుకొనేలా డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానం కింద కో–వర్కింగ్‌ స్పేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. కనీసం లక్ష మంది సొంతూరులోనే పనిచేసేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాలు, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కో–వర్కింగ్‌ స్పేస్‌లను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టు కింద పని చేస్తున్న వారు మరింత వేగవంతమైన బ్యాండ్‌విడ్త్, సీసీ కెమెరాలు, రవాణా సౌకర్యం వంటివి కోరుతున్నారని, వీటిని పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెంకట్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు