మదిని దోచే .. మన్యం సొగసు

7 Apr, 2022 05:09 IST|Sakshi
గుడిసెలో రాత్రి సమయంలో క్యాంపెయిన్‌టెంట్లలో పర్యాటకులు

పరవళ్లు తొక్కే గోదావరి సోయగాలు 

పాపికొండల యాత్ర.. మధురప్రయాణం 

మారేడుమిల్లి.. వైవిధ్యాల కలబోత 

ప్రకృతి అందాలకు నిలయం రంపచోడవరం 

మన్యానికి పెరుగుతున్న పర్యాటకులు

మనసుదోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే గోదావరి సోయగాలు.. ఎటు చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరు గాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్‌కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నదీ తీరంలో దృశ్యాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసిన తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్‌ ల్యాండ్‌) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు.  
   – రంపచోడవరం

మరుపురాని మధుర ప్రయాణం 
దేవీపట్నం–వీఆర్‌పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్‌ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలం పోచవరం వద్ద మరో బోట్‌ పాయింట్‌ ఉంది. ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్‌పై ప్రయాణం చేసి పాపికొండలు చేరుకుంటారు.
పాపికొండలు మధ్య బోట్‌లో పర్యాటకుల ప్రయాణం 

ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్‌లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్‌ డ్యామ్‌ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్‌ పాయింట్‌ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్‌పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్‌లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్‌హాల్ట్‌ హట్స్‌(వెదురు కుటీరాలు) ఉన్నాయి. 
మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి 

ప్రకృతి గుడి.. సందడి 
మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తయిన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని క్యాంపెన్‌ టెంటుల్లో బస చేస్తారు. ఎత్తయిన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి.
మారేడుమిల్లి చింతూరు ఘాట్‌రోడ్‌  

గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటకశాఖకు చెందిన త్రీస్టార్‌ వసతులతో ఉడ్‌ రిసార్ట్స్, ఎకో టూరిజమ్‌ ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్‌రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్‌ స్టార్‌ ఎకో రిసార్ట్స్‌ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి.

పురాతన ఆలయం రంప శివాలయం 
రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు