కొను‘గోలు’ కొట్టాం!

16 Jan, 2021 05:33 IST|Sakshi

‘కరోనా’లోనూ పెరిగిన కొనుగోలు శక్తి

ప్రభుత్వ సంక్షేమ చర్యలతో గాడిలో పడిన ఆర్థిక రంగం

దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రాలోనే జీఎస్టీ వసూళ్ల వృద్ధి 

సాక్షి, అమరావతి: కరోనా, లాక్‌డౌన్‌లతో దేశ వ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే.. దాన్ని త్వరితగతిన పెంచుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. దీనికి రాష్ట్రంలో వసూలవుతున్న జీఎస్టీ గణాంకాలే నిదర్శనం. లాక్‌డౌన్‌ తర్వాత సరిహద్దు రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనపర్చడంతో పాటు దక్షిణాదిలో వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం మనదే. 2019–20లో జూన్‌ నుంచి డిసెంబర్‌ నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.14,940 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో, లాక్‌డౌన్‌ తర్వాత జూన్‌ నుంచి డిసెంబర్‌ నాటికి 8.23 శాతం వృద్ధితో రూ.16,169 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇదే సమయంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. కోవిడ్‌ వంటి ఊహించని సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారానే ఇది సాధ్యమైందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల రూపంలో రూ.28,562.07 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా కొనుగోలు శక్తి పడిపోకుండా చర్యలు తీసుకుంది. దీనికి తోడు వర్క్‌ ఫ్రం హోమ్‌ వల్ల పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది స్వగ్రామాలకు రావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమైంది. లాక్‌డౌన్‌ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన గృహోపకరణాల అమ్మకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

సంక్షోభ సమయంలో సరైన నిర్ణయం
కోవిడ్‌ వంటి ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఇటువంటి సంక్షేమ పథకాలనే అమలు చేయాలి. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చురుగ్గా ఉండాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి. కానీ కోవిడ్‌–19 వల్ల చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోవడంతో జీతాలు లేక ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పన్ను వసూళ్లు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు బాగుండటం దీనికి నిదర్శనం. ప్రస్తుతం అప్పులు పెరుగుతున్నా.. కోవిడ్‌–19 ప్రభావం తగ్గిన తర్వాత ఆదాయం పెంచుకోగలమన్న ధీమా ముఖ్యమంత్రిలో ఉన్నట్లు కనిపిస్తోంది. 
– ప్రొఫెసర్‌ ఎం.ప్రసాదరావు, హెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ఆంధ్రా విశ్వవిద్యాలయం

రీస్టార్ట్‌కు తోడు సంక్షేమం
కోవిడ్‌తో దెబ్బ తిన్న రాష్ట్ర ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరిగిందనడానికి జీఎస్టీ వసూళ్లలో నమోదవుతున్న వృద్ధే నిదర్శనం. లాక్‌డౌన్‌ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రీస్టార్ట్‌ చర్యలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. అందుకే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది.
– పీయూష్‌ కుమార్, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్సెస్‌  

మరిన్ని వార్తలు