AP: ఉత్పత్తి అదిరింది.. ఆర్‌బీఐ నివేదిక 

1 Jan, 2023 02:53 IST|Sakshi

ఖరీఫ్‌లో ధాన్యాలు, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో పెరుగుదల

గత ఏడాది, ఈ ఏడాది ఖరీఫ్‌ ఉత్పత్తి, దిగుబడి, విస్తీర్ణంపై ఆర్‌బీఐ నివేదిక 

ధాన్యం 16.2% మేర.. ముతక ధాన్యాలు 10.3% మేర వృద్ధి

పప్పు ధాన్యాలు 34.1%.. నూనె గింజల ఉత్పత్తి 53.9% పెరిగింది

4.5% మేర పత్తి ఉత్పత్తి కూడా..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్‌ పంట పండింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో అన్ని ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడిలో వృద్ధి నమోదైంది. 2021–22 కన్నా 2022–23లో ధాన్యం, ముతక, చిరు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల ఉత్పత్తితో పాటు దిగుబడి­లోనూ పెరుగుదల నమోదైనట్లు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.

దేశంలో గత ఖరీఫ్‌లో (2021–22) వ్యవసాయ ఉత్పత్తుల నాల్గవ ముందస్తు అంచనాలు, 2022–23 ఖరీఫ్‌ మొదటి ముందస్తు అంచనాలతో ఆర్‌బీఐ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడి, విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో ఎంతమేర వృద్ధి నమోదైందో ఈ నివేదికలో ఆర్‌బీఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. 

మధ్యప్రదేశ్‌ రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే ధాన్యం ఉత్పత్తి గత ఖరీఫ్‌ కన్నా ఈ ఖరీఫ్‌లో పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో క్షీణత నమోదైంది. జాతీయ స్థాయిలో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిలో 6.1 శాతం క్షీణత నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంతా ధాన్యం ఉత్పత్తి 46 శాతం వృద్ధి నమోదైంది. ఆ తరువాత రాజస్థాన్‌లో 32.3 శాతం.. ఆంధ్రప్రదేశ్‌లో 16.2, ఒడిశాలో 5.9, గుజరాత్‌లో 5.1, పంజాబ్‌లో 3.8, హరియాణాలో 2.9, ఉత్తరాఖండ్‌లో 1.7 శాతం వృద్ధి నమోదైంది. 

ఖరీఫ్‌ విస్తీర్ణంలో వృద్ధి ఇలా..
► అలాగే, దేశం మొత్తం ఖరీఫ్‌ విస్తీర్ణంలో 47 శాతం విస్తీర్ణం ఉత్తరప్రదేశ్,  ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉంది.
► ఇక మన రాష్ట్రం విషయానికొస్తే.. వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ఐదు శాతం మేర పెరిగింది. 
► ధాన్యం దిగుబడి 10.6 శాతం మేర వృద్ధి నమోదైంది. 
► రాష్ట్రంలో ముతక, చిరు ధాన్యాల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడిలో భారీ వృద్ధి నమోదైంది. 
► పప్పు ధాన్యాల విస్తీర్ణం, నూనె గింజల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడుల్లో భారీగా పెరుగుదల ఉంది.
► పత్తి విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం ఈ ఖరీఫ్‌లో తగ్గింది.

నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో కాలువల కింద సాగుకు నీటిని ముందస్తుగా విడుదల చేసింది. అలాగే, రైతులకు అవసరమైన విత్తనాలతో పాటు, ఎరువులను రైతుభరోసా కేంద్రాల ద్వారానే సకాలంలో అందించింది. సాగు విషయంలో రైతుల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. 

మరిన్ని వార్తలు