జామరైతు ఆలోచన అదుర్స్‌

15 Oct, 2021 16:02 IST|Sakshi
పిందెలకు ప్లాస్టిక్‌ కవర్లు తగిలిస్తున్న రైతు   

సాక్షి, యడ్లపాడు: జామతోట సాగు చేసే రైతులకు పండుఈగతో బాధలెన్నో.. అందులోనూ థైవాన్‌రకం జామతోటలకు ఈ పండుఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. మొక్కకు ఉన్న కాయలు బాగా సైజు పెరిగి పండుదశకు చేరుకునే సమయంలో ఈగలు కాయ ల్లోకి జొరబడి పూర్తిగా పాడు చేస్తాయి. దీంతో థైవాన్‌ రకాన్ని సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు.  

మూడేళ్లగా పండుఈగతో ఇబ్బందులు.. 
మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన కౌలు రైతు గడ్డం రామసుబ్బారావు 8 ఎకరాల్లో మూడేళ్ల నుంచి థైవాన్‌లోని రెడ్, వైట్‌ జామ రకాలను సాగు చేస్తున్నాడు. అయితే కాయ పక్వానికి వచ్చే సమయంలో ఆశిస్తున్న పండుఈగ నివారణకు తొలుత మలాథిన్‌ ద్రావణాన్ని వినియోగించాడు. అది కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయడంతో రోజు మార్చి రోజు వీటిని చల్లడం పెట్టుబడి పెరిగిపోతుందని గ్రహించాడు. లింగాకర్షణ బుట్టల్ని తెచ్చి ఏర్పాటు చేశాడు. వీటి వల్ల 75శాతం పంటను కాపాడు కోగలిగానని తెలిపాడు. ఇవి 40 రోజులు మాత్రమే పని చేయడం, వర్షం కురిస్తే పనిచేయక ఒక్కసారిగా ఈగ ధాటి అధికమవ్వడంతో విసుగెత్తిపోయింది.  

ఆలోచన బాగుంది ఖర్చు తగ్గింది! 
ఆ అనుభవంలోంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్లాస్టిక్‌ పాలిథిన్‌ పలుచటి కవర్లను తీసుకువచ్చి పిందెలను అందులో ఉంచి పిన్నులు కొట్టాడు. అంతే ఇప్పుడు జామకాయలకు పండుఈగ నుంచి పూర్తిగా రక్షణ కల్పించగలిగినట్లు వెల్లడించాడు. ఇలా కవర్లు తొడిగినపుడు కాయపై అధికంగా అంటుకున్న కవర్లలోని కొన్ని కాయలు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా పెద్దగా పెట్టుబడి లేని ఈ నివారణ వల్ల మనశ్శాంతిగా ఉంటున్నట్టు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు