అహ్మదాబాద్‌లో శ్రీవారి ఆలయానికి భూమి 

6 Sep, 2022 04:42 IST|Sakshi

టీటీడీ చైర్మన్‌కు గుజరాత్‌ సీఎం హామీ 

సాక్షి, అమరావతి/తిరుమల: అహ్మదాబాద్‌లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. పాలక మండలి సభ్యుడు కేతన్‌ దేశాయ్‌తో కలిసి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం అహ్మదాబాద్‌లో సీఎం పటేల్‌ని కలిశారు.

ఈ సందర్భంగా ఆయనకు శ్రీవారి ప్రసాదం అందించి, శాలువాతో సత్కరించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేపట్టిన కార్యక్రమాలను వైవీ సుబ్బారెడ్డి గుజరాత్‌ సీఎంకి వివరించారు. ఇందులో భాగంగా జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే భువనేశ్వర్‌లోనూ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు.

త్వరలోనే ముంబైలోనూ స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నామని చెప్పారు. గుజరాత్‌లో కూడా స్వామివారి ఆలయ నిర్మాణం నిమిత్తం టీటీడీకి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు గుజరాత్‌ సీఎం సంతోషం వ్యక్తంచేసి అధికారులతో చర్చించి అవసరమైన భూమిని అనువైన ప్రదేశంలో టీటీడీకి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు