Cyclone Gulab: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు

27 Sep, 2021 18:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలగిస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు ఫీల్డ్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. చాలచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయి. సముద్రం అలజడిగా‌ ఉంది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు. సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి' అని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె కన్నబాబు తెలిపారు.

విశాఖపట్నం: మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గేట్లను ఎత్తిన ఇరిగేషన్ అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు.

గుంటూరు: తాడేపల్లి సీతానగరంలో ఉదయం నుంచచి కురుస్తున్న భారీ వర్షానికి కొండ పై నుంచి బండరాయి జారిపడింది. సంఘటన స్థలాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. 

పశ్చిమగోదావరి: నిడదవోలు మండలం కంసాలి పాలెం వద్ద ఎర్రకాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద  ముంపు గ్రామలనుఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడు, ఆర్డీఓ.తహసీల్దార్ పరిశీలించారు.

తూర్పుగోదావరి: కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో గులాబ్ తుఫాన్ కారణంగా బురద  కాలువకు రెండు మండలాల పరిధిలో వెయ్యి ఎకరాలలోని పంట పొలాలు నీట మునిగాయి.

విజయవాడ: వన్ టౌన్ చిట్టి నగర్ సొరంగం వద్ద కొండ రాళ్లు విరిగిపడ్డాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల కొండ చరియలు జారిపడ్డాయి. అయితే ఈ ఘటనలో స్థానికులకు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  ఇళ్లను ఖాళీ చేపిస్తున్నారు. 20 కుటుంబాలను షెల్టర్ హోమ్స్‌కు తరలించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం
గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80–90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోరు వర్షాలతో నాగావళి పరవళ్లు తొక్కుతోంది. తోటపల్లి ప్రాజెక్ట్‌ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మడ్డువలస వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. హిర మండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు.

ఇన్ ఫ్లో ఎక్కువగా ఉంది
విశాఖ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్‌లో నీరు గరిష్ఠ స్థాయికి చేరింది. అరవై ఒక్క అడుగుల గరిష్ఠ స్థాయిలో నీరు ఉండే ఈ రిజర్వాయర్లో తాజాగా 61 అడుగుల నీరు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో డ్యామ్‌ నాలుగు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో ఈ మధ్య ఎప్పుడూ కూడా రిజర్వాయర్లోకి ఈ రకంగా వర్షపు నీరు రాలేదని అధికారులు తెలిపారు.

గోదావరి జిల్లాలోనూ గులాబ్‌ ఎఫెక్ట్‌
తూర్పుగోదావరి జిల్లాలో గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తోతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జలమయమయ్యాయి. ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోకవరం మండలం ఇటికాయల పల్లి గ్రామంలో ఇళ్లలోకి నీరు రావడంతో మోటార్లతో నీటిని తోడు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాతేరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలో కడియం మండలంలో అత్యధిక వర్షపాతం 137.2 మిల్లీమీటర్లు నమోదయింది. ఏజెన్సీలో కూడా ఏకదాటిగా వర్షం కురుస్తోంది.

ఈ నెల 28న మరో అల్పపీడనం 
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని  ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు.

ఉత్తరాంధ్రకు వరద హెచ్చరిక 
ఆదివారం రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.

27 మండలాల్లో ‘గులాబ్‌’ ప్రభావం 
తుపాను దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 27 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసి యుద్ధప్రాతిపదికన పరికరాలు, సిబ్బందిని  తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. 276 ప్రైవేటు క్రేన్లు, 64 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. 25,500 విద్యుత్‌ స్థంభాలు, 2,732 ట్రాన్స్‌ఫార్మర్లు స్టోర్‌లో ఉంచారు.

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ‘స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో 1400 మందితో 70 బృందాలు, విజయనగరం జిల్లాలో 700 మందితో 35 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 1440 మందితో 72 బృందాలను రంగంలోకి దించారు. పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను నియమించారు. తుపాను నేపధ్యంలో ఏపీఈపీడీసీఎల్‌ చేపట్టిన ఏర్పాట్లపై డిస్కం సీఎండీ కె.సంతోషరావుతో కలసి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ సమీక్ష నిర్వహించారు. లైన్‌మెన్‌ నుంచి చైర్మన్‌ వరకూ ఎవరికీ సెలవులు ఉండవని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు