ఖాకీ వనంలో ‘గోపాలుడు’ 

28 Mar, 2022 15:04 IST|Sakshi
తాను పెంచుకుంటున్న గోవుల మధ్య సంచరిస్తున్న ఎస్‌ఐ తిప్పయ్యనాయక్‌ 

రెండు ఆవులతో మొదలైన ప్రస్థానం 

జీతంలోనే గో సంరక్షణ బాధ్యత 

ఒత్తిళ్ల జీవితానికి ఎంతో ఉపశమనమంటున్న ఎస్‌ఐ తిప్పయ్య నాయక్‌

గుమ్మఘట్ట(అనంతపురం జిల్లా): క్షణం తీరిక లేని వృత్తిలో కొనసాగుతూనే పశు పోషణపై ఆసక్తి కనబరుస్తున్నారు గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పయ్య నాయక్‌. ఇది గొప్ప అనుభూతినిస్తుందని అంటున్నారు.  విధుల నిర్వహణలో ఆవుల పోషణ అడ్డంకి కాకూడదని భావించిన ఆయన.. తన స్వగ్రామంలో  ప్రత్యేకంగా షెడ్‌ ఏర్పాటు చేసి, వాటి రక్షణ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఏమాత్రం తీరిక దొరికినా.. వెంటనే స్వగ్రామానికి వెళ్లి ఆవుల మధ్య గడపడాన్ని ఆలవాటుగా చేసుకున్నారు. ఇది ఒత్తిళ్లతో కూడిన జీవితానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

చదవండి: AP: కొలువులు పట్టాలి

పూర్వీకుల ఆస్తిగా...  
పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన లక్ష్మానాయక్, లక్ష్మీదేవి దంపతులకు రెండో సంతానంగా తిప్పయ్య నాయక్‌ జన్మించారు. ఉమ్మడి కుటుంబం విడిపోతున్నప్పుడు ఆస్తుల భాగ పరిష్కారంలో భాగంగా రెండు ఆవులు తిప్పయ్య నాయక్‌కు వచ్చాయి. తాను పోలీసు శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నా.. పూర్వీకుల ఆస్తిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వచ్చారు.

30కి చేరిన ఆవుల సంఖ్య.. 
స్వగ్రామంలో తొలుత రెండు ఆవులతో మొదలైన సంరక్షణ బాధ్యతలు.. ప్రస్తుతం 30కి చేరుకుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్‌ వేశారు. వాటి పోషణకు తన జీతం నుంచి కొంత మొత్తం వెచ్చిస్తున్నారు. దీనికి తోడు భార్య వసంత లక్ష్మి, కుమారులు ఈశ్వర నాయక్, వరప్రసాద్‌ నాయక్‌ తరచూ స్వగ్రామానికి వెళ్లి పాడి పోషణను పర్యవేక్షిస్తున్నారు.

పాల విక్రయానికి దూరం
మందలో పాలిచ్చే ఆవులు పదికి పైగా ఉన్నా...  వీటి పాలను ఇతరులకు విక్రయించడం లేదు. మొత్తం పాలను దూడలకే వదిలేస్తున్నారు. అయితే తల్లిని కోల్పోయిన నవజాత శిశువులకు, తల్లిపాలు లేక ఇబ్బంది పడుతున్న చంటి పిల్లలకు మాత్రం ఉచితంగా అందజేస్తున్నారు. నిత్యమూ ఒత్తిళ్లతో కూడిన పోలీసు శాఖలో పనిచేస్తున్న తాను.. ఎలాంటి ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి   గోసంరక్షణే కారణమని ఎస్‌ఐ తిప్పయ్య నాయక్‌ చెబుతున్నారు. పాడి పోషణ ద్వారా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.

మరిన్ని వార్తలు