రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

7 Oct, 2020 14:03 IST|Sakshi

 సాక్షి, గుంటూరు :  నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరస్వతి విగ్రహం ధ్వంసం అంటూ ఫేక్‌ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు. ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం. జిల్లాలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిమిషాల వ్యవధిలో ఫేక్‌ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి చేరింది. ఈ ఫేక్‌ న్యూస్‌కు కుల, మత, రాజకీయ రంగు పులిమారు. 

ఫేక్‌ న్యూస్‌పై కాలేజీ యాజమాన్యం కూడా షాక్ తిన్నది. న్యూస్ షేర్‌ చేసేటప్పుడు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టిన వార్తలపై పోలీసుల నిఘా ఉంటుంది. రెండేళ్ల క్రితం కళాశాల ఖాళీ చేస్తున్న సమయంలో సామాగ్రి, షెడ్లు తరలించే ప్రక్రియలో విగ్రహం దెబ్బతినటంతో అక్కడే వదిలి వెళ్లారు. పాత సంఘటనలను ప్రచారం చేసేవారి మాయలో పడొద్దు.  మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

ఇద్దరిపై కేసు నమోదు
కాగా ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన పాత కృష్ణవేణి జూనియర్‌ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసి సరస్వతి దేవీ విగ్రహం ధ్వంసం చేశారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్‌ చేశారు. దీనిపై ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్‌ మీడియాలో ఫోటోలు అప్‌లోడు చేసిన మురళి, మహేష్‌ రెడ్డి అనే ఇద్దరిపై పిడుగురాళ్ల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివాదాల సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

మరిన్ని వార్తలు