రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి

9 Sep, 2021 18:18 IST|Sakshi

సీఎం జగన్‌ని కలిసిన రమ్య తల్లిదండ్రులు

సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్య తల్లిదండ్రులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఏపీ హోం మంత్రి సుచరిత రమ్య తల్లిదండ్రులను సీఎం వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో రమ్య సంఘటనను ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్‌కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం తమకు 10 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. రమ్య కుటుంబానికి పూర్తిగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. (చదవండి: గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్‌ విద్యార్థిని హత్య)

అనంతరం హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘‘గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని సీఎం జగన్‌ నేడు పరామర్శించారు. దారుణం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి.. 7 రోజుల్లో ఛార్జ్ షీట్ వేశాం. రమ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాం. అంతేకాక రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలని సీఎం జగన్‌ నేడు ఆదేశించారు. దానితో పాటు వారి కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పంట భూమి అందించాలని తెలిపారు. మరో 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్‌తో వాళ్ళు తనతో టీ తాగాలని సీఎం జగన్ అన్నారు’ అని  సుచరిత తెలిపారు.

‘‘అనేక మందికి దిశా యాప్ ద్వారా భద్రత కలుగుతోంది. ఇంకా ప్రతి ఒక్కరికి యాప్, చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. గ్రామంలో ఒకరిద్దరు దీన్ని వినియోగించుకున్నా సఫలం అయినట్లే’’ అన్నారు సుచరిత.

చదవండి: హాస్టల్‌ పైనుంచి దూకి బీటెక్‌ స్టూడెంట్‌ మృతి, వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు