అద్భుతాలు  చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి

23 Jan, 2023 10:32 IST|Sakshi
అత్తోటలో భూమి భారతి ప్రాంగణం (ఇన్‌సెట్‌లో) ప్రకృతి వ్యవసాయం విత్తనాలు

2016లో మూడు రకాల వరి విత్తనాలతో మొదలు

నేడు 365 రకాలకు చేరిక

ప్రైవేటు రంగంలో ఇదే తొలి విత్తన నిధి  

ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట  

ఈ యజ్ఞానికి తానా సహకారం

ఒక్క ఊరిలోనే 80 మంది రైతులు    ప్రకృతి వ్యవసాయం లోకి.. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: దేశీయ వరి విత్తనాలకు పెద్దపీట వేస్తూ ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు  చేస్తున్నారు అత్తోట రైతులు. 2016లో మూడు రకాల వరి వంగడాలతో ప్రారంభించి ఈ ఏడాది 365 దేశవాళీ రకాలను పండిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వరి వంగడాలను పండించడమే కాకుండా భూమి భారతి పేరుతో విత్తన నిధిని ఏర్పాటు చేశారు.

దేశీయ వరి రకాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఇదే తొలి విత్తన నిధి కావడం గమనార్హం. ఈ యజ్ఞానికి తానా తన వంతు సహకారం అందించింది.  మొదట్లో ఏడెనిమిది మంది రైతులతో ఐదు ఎకరాల్లో ప్రారంభించిన ఈ ప్రక్రియ ఈ రోజున ఒక్క అత్తోట గ్రామంలోనే ఎనభై మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ దేశీయ వరి రకాలను పండిస్తున్నారు. రసాయనాల ప్రసక్తి లేకుండా కేవలం ప్రకృతి ఆధారిత సాగు పద్ధతుల్లో తీసిన విత్తనాలతో ‘దేశవాళీ విత్తన నిధి’ ఏర్పాటు చేశారు.  

ప్రకృతి వ్యవసాయం–దేశీయ వంగడాలు 
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో రైతులు కొన్నేళ్లుగా దేశవాళి వరి వంగడాలను ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. గ్రామరైతు యర్రు బాపన్న నేతృత్వంలో మరో ఏడుగురు కలిసి దేశవాళీ వరి రకాల విత్తనాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఒక రైతు పంటను వేసుకోవడంతో పాటు విత్తనాలను కూడా తానే తయారు చేసుకునే అవకాశం దేశవాళీ విత్తనాలపై ఉంది. గత ఏడాది 365 రకాలను పండించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారుచేసుకుంటున్నారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు అందిస్తున్నాయి.   

‘దేశవాళీ విత్తన నిధి’ ఏర్పాటు  
అత్తోట రైతు యర్రు బాపయ్య గత ఆరేళ్లుగా ఈ విత్త­నాలను సేకరిస్తూ సాగులో ఉన్నారు. ఆయన తానా సహకారంతో అత్తోట శివారులో విత్తననిధిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 365 రకాల ధాన్యం అందుబాటులో ఉంచారు. ఈ పంటలు వేసుకునే రైతు­ల­కు ఆయా రకాలను అందిస్తున్నారు. ధాన్యం కా­వా­లనే వారికి మర ఆడించి ఇచ్చేందుకు చిన్నస్థాయి రైస్‌మిల్‌ను తమ ఆవరణలోనే ఏర్పాటు చేసుకున్నారు.  మెట్టలో తొలినుంచీ ప్రకృతి సేద్యం చేస్తు­న్న నామన రోశయ్య వీరికి స్ఫూర్తిగా నిలిచారు. 78 ఏళ్ల వయసులో కూడా ముప్పాతిక ఎకరం (75­సెంట్లు)లో వ్యవసాయం చేస్తూ ఏడాదికి లక్షన్నరకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ వయసు­లోనూ కొ­బ్బరిచెట్లను అవలీలగా ఎక్కుతూ గెలల­ను దింపుతూ మార్కెటింగ్‌ చేసుకుంటున్నాడు. కొ­బ్బ­రి సహా 23 రకాల పండ్ల చెట్లు సాగు చేస్తున్నాడు. 

అన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే రకాలే..  
ఇక్కడ అరుదైన రకాలను సేకరించి సాగుచేశారు. బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’ని సాగుచేశారు. వర్షాధారమై, ఎక్కువ పోషకాలుండే ‘సారంగనలి’ మరో రకం. వండేటపుడు చక్కని సువాసననిచ్చే పొడుగైన బియ్యం ‘ఢిల్లీ బాసుమతి’, ‘ఇంద్రాణి’ రకాలు, గడ్డి నుంచి బియ్యం వరకు సమస్తం నలుపురంగులో ఉండి రోగనిరోధక శక్తినిచ్చే ‘కాలాబట్టి’ (బ్లాక్‌రైస్‌), తెగుళ్లు, దోమకాటు దరిచేరని ‘దాసమతి’, మధుమేహాన్ని అదుపుచేసే నవారా, బలవర్ధకమైన ‘మాపిళై సాంబ’తోపాటు నెల్లూరు మొలకొలుకులు, తులసీబాసో, బాస్మతి, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి, దురేశ్వర్, పంచరత్న, రక్తశాలి, చింతలూరి సన్నం, కుజపటాలియా వంటివి ప్రముఖమైనవి. ఈ రకాలన్నీ ఆరోగ్య ప్రయోజనాలనిచ్చేవే.

దేశవాళీ సాగును ప్రోత్సహించడమే..
దేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యువైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి సంరక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది.అందుకే రైతులకు విత్తనాలు అందించేందుకు వీలుగా తానా సహకారంతో భూమి భారతి విత్తన నిధిని ఏర్పాటు చేశాము.
– యర్రు బాపన్న, సంప్రదాయ సాగు రైతు, అత్తోట 

మరిన్ని వార్తలు