సత్తా చాటిన ‘దిశ’.. న్యాయం జరిగింది

29 Apr, 2022 16:22 IST|Sakshi

 రికార్డు వేగంతో రమ్య కేసులో దర్యాప్తు 

10 గంటల్లోనే నిందితుడి అరెస్టు 

48 గంటల్లోనే ఫోరెన్సిక్‌ నివేదికలు

వారం రోజుల్లో చార్జ్‌షీట్‌  

ప్రత్యేక పీపీ ద్వారా క్రమంతప్పకుండా వాదనలు

257 రోజుల్లోనే హంతకుడికి ఉరిశిక్ష

సాక్షి, అమరావతి: ‘మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి దిశ వ్యవస్థ ద్వారా ఉరి శిక్ష వేయించండి చూద్దాం..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తరచూ ప్రభుత్వానికి విసురుతున్న సవాల్‌కు శుక్రవారం జవాబు లభించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతి తక్కువ వ్యవధిలో ఓ  హంతకుడికి న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయించింది. గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను 10 గంటల్లోనే అరెస్టు చేయడంతోపాటు.. సత్వరం చార్జ్‌షీట్‌ దాఖలు, ఫోరెన్సిక్‌ నివేదికల సమర్పణ, క్రమంతప్పని రీతిలో విచారణ ద్వారా నిందితుడి నేరాన్ని రుజువు చేసి, కేవలం 257 రోజుల్లోనే దోషిగా తేల్చి.. కోర్టు ద్వారా ఉరి శిక్ష వేయించగలిగింది. మహిళా భద్రత పరిరక్షణలో దేశానికే దిశ వ్యవస్థ చుక్కానిగా నిలిచింది. 

యుద్ధప్రాతిపదికన స్పందన
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణం గుర్తించి సత్వరం శిక్ష విధించే ప్రక్రియలో దిశ వ్యవస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. 2021 ఆగస్టు 15న గుంటూరులో ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్యపై శశికృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు నిందితుడిని కేవలం 10 గంటల్లోనే అరెస్టు చేశారు. నేర నిరూపణకు కీలకమైన ఫోరెన్సిక్, డీఎన్‌ఏ పరీక్షలను కేవలం 48 గంటల్లోనే పూర్తి చేసి నివేదికలు తెప్పించారు. నిందితుడు సాంకేతికపరమైన లోపాలను అవకాశంగా చేసుకుని తప్పించుకునేందుకు ఏమాత్రం వీలులేకుండా చేశారు. రమ్య మృతదేహం, నిందితుడి దుస్తులు, కత్తి, ఘటనా స్థలంలో ఉన్న రక్తపు నమూనాలను సరిపోల్చి నిర్ధారించారు. 

ఫోరెన్సిక్‌ వ్యవస్థ బలోపేతం
కేవలం రెండ్రోజుల్లోనే ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలు తెప్పించడం దిశ వ్యవస్థతోనే సాధ్యమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగం హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్‌ నివేదికల కోసం నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించి నివేదికలు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేది. కానీ దిశ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగాన్ని బలోపేతం చేసింది. గుజరాత్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ సౌజన్యంతో రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలను నెలకొల్పడంతో పాటు ఈ వ్యవస్థను మూడింతలు అభివృద్ధి చేసింది. ఆ విభాగంలో నిపుణులను ఐదింతలు పెంచింది. తద్వారా రమ్య కేసులో కేవలం 48 గంటల్లోనే ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలను తెప్పించారు. దిశ వ్యవస్థలో భాగంగా సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐదింతలు బలోపేతం చేసింది. దాంతో ఈ కేసులో నిందితుడి కాల్‌డేటాను పోలీసులు సత్వరం, సమర్థవంతంగా విశ్లేషించగలిగారు. హత్యకు ముందు నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడిన టవర్‌ లొకేషన్, రమ్యను వేధిస్తూ అంతకుముందు మాట్లాడిన కాల్‌డేటా, పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు అన్నింటినీ నిర్ధారించారు. పక్కాకుట్రతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని నిరూపించే సాక్ష్యాలను పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. 

చకచకా కొలిక్కి..
రమ్య హత్య కేసును పోలీసులు దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ కేసులో కేవలం వారం రోజుల్లోనే చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం విశేషం. దిశ కేసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం కేసు సత్వర విచారణకు దోహదపడింది. గతంలో మహిళలపై దాడుల కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగేది. ఎందుకంటే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఇతర పోలీసు కేసులతోపాటు ఈ కేసులను కూడా వాదించాల్సి వచ్చేది. దాంతో పని భారంతో తరచూ వాయిదాలు కోరేవారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ అడ్డంకిని తొలగించింది. దిశ కింద నమోదు చేసిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. దాంతో రమ్య హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ క్రమం తప్పకుండా న్యాయస్థానంలో విచారణకు హాజరై నేరాన్ని పూర్తి ఆధారాలతో నిరూపించారు. తద్వారా హత్య జరిగిన 257 రోజుల్లోనే కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించేలా దిశ వ్యవస్థ తన సత్తా చాటింది.


‘దిశ’తో దర్యాప్తు వేగవంతం ఇలా

  • మహిళలపై దాడుల కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలి. కాగా ఏపీ పోలీసులు 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక వేధింపుల కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. 
  • దేశంలోనే అత్యధికంగా 854 కేసుల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
  • 2020–21లో దేశంలోనే అత్యధికంగా 92.21 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. 2022లో ఇప్పటి వరకు 94.94 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్‌షీట్లు నమోదు చేశారు.  
మరిన్ని వార్తలు