4 ఏళ్ల నరకయాతన.. 3 రోజుల్లో విముక్తి 

2 Dec, 2021 04:14 IST|Sakshi
చికిత్స తర్వాత నడుస్తున్న రమణయ్య

సాక్షి, అమరావతి: నాలుగేళ్ల నరకయాతనకు గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు మూడు రోజుల్లో విముక్తి కల్పించారు. 10 లక్షల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే ‘స్టిఫ్‌ పర్సన్‌ సిండ్రోమ్‌’ రుగ్మతకు చికిత్స చేయించుకున్న రైతు కోలుకుని హాయిగా నడవగలిగే స్థితికి వచ్చాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన రైతు ఆర్‌.రమణయ్య కు 2017 నుంచి ఉన్నట్టుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్సరే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు.

ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీ వ్యవస్థ సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి, ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయం కాలేదు. నాలుగేళ్లలో సుమారు రూ.10 లక్షలను ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. చివరకు సెల్‌ఫోన్‌ రింగ్‌ వినిపించినా, చిన్న శబ్దమైనా అతడి కండరాలు అమాంతం బిగుసుకుపోయేవి.  చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న రమణయ్యను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుందరాచారి.. రమణయ్య ‘స్టిఫ్‌ పర్సన్‌ సిండ్రోమ్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారిచారు. 3 రోజుల చికిత్స అందించిన అనంతరం రమణయ్య స్వతహాగా లేచి నడవడం ప్రారంభించాడు.  

మరిన్ని వార్తలు