ఎంపీ గల్లా కనపడటం లేదు

24 Nov, 2022 08:47 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నియోజకవర్గ ప్రజలకు కనపడటం లేదు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంపీ ల్యాడ్స్‌ నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా అసలు ప్రతిపాదనలే పంపలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్‌ కేటాయించింది. ఇందులో రూ.4.86 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చినా ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ.కోటీ 25 లక్షలు మాత్రమే.

మిగిలిన పనుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. 2020–21 సంవత్సరంలో కోవిడ్‌ కారణంగా నిధులు విడుదల చేయలేదు. 2021–22 సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించింది. అందులో రూ.31 లక్షలకు ప్రతిపాదనలు ఇచ్చినా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క ప్రతిపాదన కూడా ఎంపీ నుంచి రాలేదు. అదే రాజసభ్య సభ్యునిగా ఎన్నికైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2020–21కి గాను రూ.3.80 కోట్ల నిధులు తీసుకురాగా రూ.3.50 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.2.26 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు.  

 జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. లోక్‌సభ సమావేశాలు లేని సమయంలో దాదాపుగా తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అయితే గుంటూరు ఎంపీ గల్లా మాత్రం దీనికి భిన్నంగా అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న డౌట్‌ వచ్చేలా వ్యవహరిస్తున్నారు.  

అమలుకానీ హామీలు.. 
వరుసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా జయదేవ్‌ నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన కార్యాలయం కూడా ఉన్నా లేనట్లుగానే ఉంది. ఏ సమస్యపై వెళ్లినా స్పందించే వారే లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గుంటూరు పార్లమెంట్‌ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్‌ తర్వాత కాలంలో గుంటూరు మొహం చూడటం మానుకున్నారు. గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో అసలు జనానికే తెలియని పరిస్థితి ఉంది. అసలు గుంటూరుకు ఎంపీ ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అది కూడా వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. తన అత్త దశదిన కర్మలో భాగంగా బుర్రిపాలెంకు, తన మామ సూపర్‌స్టార్‌ కృష్ణ అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు మాత్రమే ఆయన జిల్లాలో అడుగు పెట్టారు. ఇటువంటి ఎంపీని ఎన్నుకోవడం మా ఖర్మ అని తెలుగుదేశం కేడర్‌ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు