కృష్ణా తీరంలో తిరుమలేశుడు

9 Jun, 2022 10:52 IST|Sakshi

వెంకటపాలెంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశుడు

నూతన ఆలయంలో వైభవంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ

వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆగమశాస్త్రోక్తంగా కార్యక్రమాలు

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్, టీటీడీ చైర్మన్‌

అమరావతిలో ఆధ్యాత్మిక శోభ: స్వరూపానందేంద్ర సరస్వతి

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు:  టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడికొండ: కృష్ణాతీరంలో తిరుమలేశుడు కొలువయ్యాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేశస్థానం నిర్మించిన ఆలయంలో భక్తులకు శ్రీవేంకటేశుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలో గురువారం ఉదయం మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరిగింది. ఉదయం 7.50 నుంచి 8.10 గంటల నడుమ టీటీడీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరించందన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకు ముందు ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7.15 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు.

అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం బ్రహ్మఘోష, వేదశాత్తుమొర జరిగాయి. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో టీటీడీ రూ.31 కోట్లతో ఈ ఆలయం నిర్మించింది.

ఆలయం శిల్పకళ అద్భుతం : స్వరూపానందేంద్ర సరస్వతి
ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరిక మేరకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణంతో రాజధాని అమరావతిలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు.

వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్నే వచ్చాడా అన్నట్లుగా ఉందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా  ఈ ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. 

బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో 1,300 ఆలయాలు : వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్లలో 1,300 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

అమరావతిలోనే స్వామి వారి దర్శనం
రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మనందరినీ ఆశీర్వదించడానికి స్వామివారు తిరుమల నుండి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు అమరావతిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, ఎంపీ నందిగం సురేష్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హెనీ క్రిస్టినా, బోర్డు సభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్, మల్లాడి కృష్ణారావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయ ముఖ మండపంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరించందన్‌ను టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణదారులను టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు.

సాయంత్రం కార్యక్రమాలు..
ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు.  

చదవండి: (చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?)

మరిన్ని వార్తలు