గుంటూరు: యువతి అత్యాచార కేసులో పురోగతి

22 Jun, 2021 14:59 IST|Sakshi

సాక్షి, గుంటూరు:  గుంటూరు జిల్లా యువతి అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనకు సంబంధించి అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఇప్పటికే పోలీసులు చాలా మందిని విచారించారని,  ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేస్తామని, దర్యాప్తు అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఆమె పేర్కొన్నారు. కాగా గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్‌ మండలం సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి(జూన్‌ 19) నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం విదితమే.

నిందితుల గొంతు విన్నా గుర్తు పడతానని బాధితురాలు చెబుతుండటంతో అనుమానితుల వాయిస్ బాధితురాలికి వినిపించి నిందితులను నిర్ధారణ చేసుకోవాల్సి ఉందని మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని కామెంట్ చేస్తున్నాయని, తమ ప్రభుత్వం నిజమైన నిందితుల్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తుందని స్పష్టం చేశారు. ఎవరిని పడితే వారిని అమాయకుల్ని కేసులో ఇరికించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు  ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.

మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ఏపీ మంత్రులు సుచరిత, తానేటి వనిత ప్రకటించారు.

చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్‌ 
ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు