సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు

7 Jan, 2021 10:39 IST|Sakshi
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆషా దళవాయి (ఫైల్‌), ఎవరెస్ట్‌ శిఖరంపై సంధ్య(ఫైల్‌)

సాక్షి, గుంటూరు: దేనినైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసం.. సాహస కృత్యాలపై మక్కువ.. కలగలిపిన వారి సంకల్ప బలం ముందు ఎత్తయిన పర్వతాలు చిన్నబోయాయి. జిల్లాకు చెందిన కొందరు యువతీ, యువకులు అవరోధాలను అధిగమిస్తూ.. శిఖరాలను ముద్దాడుతూ రికార్డులు కైవసం చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలు అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు గుంటూరుకు చెందిన ఆశ దళవాయి. గుంటూరులో నివాసం ఆశకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. నగరంలోని టీజేపీఎస్‌ కళశాలలో 2007లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎన్‌సీసీలో హిల్‌ మౌంటెనీరింగ్‌ కోర్సుకు సెలక్ట్‌ అయి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (పర్వతారోహణ)లో శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయా మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బేసిక్‌ అడ్వెంచర్స్, వివిధ రకాల పర్వతారోహణ కోర్సుల్లో తర్ఫీదు పొందారు. అక్కడి నుంచి వచ్చి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ఔట్‌రైవల్‌ అడ్వెంచర్స్‌ అనే సంస్థను ప్రారంభించి వివిధ పాఠశాలల్లో  విద్యార్థులకు అడ్వెంఛర్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పర్వతారోహణపై అవగాహన కల్పించారు.  

పర్వతారోహణ ఇలా....
2019 జులై 16 నుంచి 20 వరకూ ఐదు రోజులు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో అధిరోహించారు. అనంతరం అదే సంవత్సరంలో యూరప్‌లోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్‌బ్రూ శిఖరాన్ని, అర్జెంటినాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకగువా పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహణకు సిద్ధమైన తరుణంలో గత ఏడాది కరోనా వ్యాప్తి, లాక్‌ డౌన్‌ ఆంక్షలు ఉండటంతో ఆ ఆలోచన  విరమించుకున్నారు. ప్రస్తుతం ఎవరెస్ట్‌ అధిరోహణకు సన్నద్ధం అవుతున్నానని ఈ ఏడాది అధిరోహణ పూర్తి చేస్తానని ఆమె చెబుతున్నారు.

కిలిమంజారో శిఖరంపై సాయికిరణ్‌ (ఫైల్‌) 

యువకిరణం
చిలకలూరిపేట పట్టణం ఎంవీఆర్‌ కాలనీకి చెందిన సాయికిరణ్‌కు పర్వతారోహణంపై మక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే అడ్వెంచర్‌ సంస్థలను సంప్రదించి పర్వతారోహణకు ప్రయత్నించాడు. అయితే వయసు సరిపోదని అందరూ చెప్పడంతో, 2019లో ఇంటర్మీడియట్‌ చదివేప్పుడు 18 ఏళ్లు నిండిన వెంటనే తెలంగాణ రాష్ట్రం భువనగిరి గుట్టలోని రాక్‌ క్లైంబింగ్‌లో జనవరి మాసంలో చేరి శిక్షణ పొందాడు. అనంతరం ఫిబ్రవరి నెలలో దాతల సహకారం లభించడంతో కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించాడు. అదే ఏడాది ఆగస్టు నెలలో సిక్కింలోని వెస్ట్‌టెంజింగ్‌కాన్‌లో శిక్షణ పొంది ఏ గ్రేడ్‌ సాధించాడు. అనంతరం ఉత్తర భారతదేశంలోని లీలాధన్‌లో 6,158 మీటర్ల ఎత్తయిన స్టోక్‌ కాంగ్రీ  పర్వతాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిసి ఎక్కి 365 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని పర్వతంపై రెపరెపలాడించారు. ఇందుకు గాను హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సాధించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సాయి కిరణ్‌ 2019 డిసెంబర్‌లో ప్రసంశ పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. 

ఘనతకు ప్రభుత్వ గుర్తింపు... 
వెల్దుర్తి మండలం చిన్నపర్లపాటి తండాకు చెందిన వడితె సంధ్యబాయి 2017 మే నెలలో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. 2017లో నాగార్జున సాగర్‌ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ కళాశాలలో సంధ్య ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఎవరెస్ట్‌ అధిరోహణకు దరఖాస్తులు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది వరకూ దరఖాస్తు చేసుకోగా విజయవాడలో జరిగిన ప్రైమరీ సెలక్షన్స్‌లో 30 మంది ఎంపికయ్యారు. అనంతరం వీరిని జమ్మూ కశ్మీర్‌కు తరలించి అక్కడ ఫైనల్‌ సెలక్షన్స్‌ ముగిసే సమయానికి 13 మంది మిగిలారు. 13 మందిలో అబ్బాయిలు 11 మంది కాగా ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సంధ్య, మరో అమ్మాయి పశ్చిమ గోదావరి వాస్తవ్యురాలు. ప్రత్యేక శిక్షణ అనంతరం దిగ్విజయంగా ఎవరెస్ట్‌ పర్వతారోహణ సంధ్య పూర్తి చేసింది. ఈమె సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. రూ.10 లక్షల రివార్డును అందించడంతో పాటు, ప్రస్తుతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులను సర్కార్‌ భరిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు