అవినీతికి బ్రాండ్‌ వరదాపురం సూరి

23 Aug, 2021 14:04 IST|Sakshi

టీడీపీ హయాంలోనే అంతులేని అక్రమాలు

సామాజిక తనిఖీలో  బట్టబయలు

నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి

ధర్మవరం టౌన్‌: టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్‌ వరదాపురం సూరి∙అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆయన హయాంలోనే ఉపాధి హామీ పనులు, ఉద్యాన పథకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు బట్టబయలవ్వడంతో సూరిలో కలవరం మొదలైందన్నారు. ఆదివారం ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ నిధులు వ్యక్తిగతంగా డ్రా చేయడం సాధ్యం కాదనే విషయం కూడా తెలియకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.

సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో నిధులు ఖర్చు చేస్తారన్న కనీస అవగాహన లేకుండా ప్రజాప్రతినిధిగా ఎలా చలామణి అయ్యావంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సూరి చేసిన అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, డబ్బులు వసూళ్లపై లఘు చిత్రం తీసి ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ముదిగుబ్బ మండలంలోనే మొత్తం రూ.27.73కోట్ల పనులు జరిగితే రూ.9 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులోనూ  సంకేపల్లి పంచాయతీ పరిధిలో రూ.4.36కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో బట్టబయలైందని గుర్తు చేశారు.

ఇందుకు కారకులైన 24 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. నీరు చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పందిరి తీగలు, పాత తోటల పునరుద్ధరణ, పండ్ల తోటల విస్తరణ తదితర పథకాలకు సంబంధించి రూ.కోట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే టీడీపీ పాలనలో సూరి సాగించిన అవినీతి, ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి సాధించిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్‌ విసిరారు. సమావేశంలో సర్పంచ్‌ నాగానందరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పోతిరెడ్డి, కత్తెకొట్టాల కృష్ట, వెంకట్రామిరెడ్డి, నాయకులు మల్లాకాలువ మురళి, కనంపల్లి రామచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, తుంపర్తి కృష్ణారెడ్డి, పోతులనాగేపల్లి శివారెడ్డి, బిల్వంపల్లి హరి, గొట్లూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు