సాక్షి ఎఫెక్ట్‌: అక్రమాల కోటలు కూలుతున్నాయ్‌..

26 Apr, 2021 09:21 IST|Sakshi
పల్లా శ్రీనివాసరావుకు చెందిన అనధికార నిర్మాణాన్ని జేసీబీతో తొలగిస్తున్న దృశ్యం

సాక్షి వరుస కథనాలతో బయటపడుతున్న టీడీపీ నేతల అడ్డగోలు కట్టడాలు 

పల్లా అనధికార నిర్మాణంపై జీవీఎంసీ చర్యలు

ప్లాన్‌కు విరుద్ధంగా వాణిజ్య సముదాయ నిర్మాణం కూల్చివేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

వెలగపూడి బ్యాచ్‌ ఫుట్‌పాత్‌ ఆక్రమణలపైనా కొరడా

70 షాపులను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది 

సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాలను జేసీబీలతో కూలగొడుతుంటే.. టీడీపీ నేతల వెన్నులో వణుకుపుట్టింది. అడ్డగోలుగా ఫుట్‌పాత్‌ ఆక్రమించేసి ఏర్పాటు చేసిన దుకాణాల్ని తొలగిస్తుంటే... కబ్జాదారులకు చెమటలు పట్టాయి.  ఐదేళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార దర్పం ప్రదర్శించారు. నిబంధనలు మీరి అక్రమాల పునాదులపై అడ్డగోలుగా నిర్మించినవి కొన్నైతే.. స్థలాలు కబ్జా చేసి దర్జాగా కట్టిన కోటలు ఇంకొన్ని.. వెరసి టీడీపీ నేతల దాష్టీకాలపై అధికారులు పంజా విసిరారు.

‘సాక్షి’ దినపత్రికలో వరుసగా ప్రచురితమవుతున్న తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాల సిత్రాలు.. నగరంలో సంచలనంగా మారాయి.  పల్లా ఆక్రమణలకు మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు చిన్నబోయి అక్రమాల కంచెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడా కబ్జా కంచెను కత్తిరించేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా చేపడుతున్న అడ్డగోలు నిర్మాణాన్ని  జీవీఎంసీ పెకలించేసింది. మరోవైపు వెలగపూడి బ్యాచ్‌ ఫుట్‌పాత్‌ ఆక్రమణలపైనా జీవీఎంసీ ఉక్కుపాదం మోపింది. రెండు కిలోమీటర్ల వ్యవధిలో ఏకంగా 70 దుకాణాలను ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేసి దందా సాగించిన పచ్చ రాబందుల రెక్కలు విరిచేశారు.

పల్లా అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ కొరడా
గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూలి్చవేశారు. దీనిపై తొలుత కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత, అధికారులు, పోలీసులు చొరవ తీసుకోవడంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తమ పని పూర్తిచేశారు. గాజువాకకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాతగాజువాక జంక్షన్‌లోని 1033 చదరపు గజాల (864.33 చదరపు మీటర్ల) స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. 227.84 చదరపు మీటర్ల వరకు రోడ్డు విస్తరించి ఉంది. దీంతో ఆయనకు 636.49 చదరపు మీటర్లు మిగిలింది. ఇందులో నిబంధనల ప్రకారం మినహాయింపులు పోనూ 221.45 చదరపు మీటర్ల స్థలంలో ఈ సముదాయ నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్‌+జి+4 భవన నిర్మాణానికి అనుమతి పొందగా, ప్రస్తు తం  సెల్లార్‌+జి+1 అంతస్తుల  శ్లాబులు పూర్తిచేశారు.

అయితే అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణం సాగుతోందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన అధికారులు నిజమేనని నిర్ధారించారు. ఈ నిర్మాణంలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్‌లో 25.46 చదరపు మీటర్ల ఏరియా కూడా ఆక్రమణకు గురవడంతోపాటు సెట్‌ బ్యాక్‌లను కూడా ఉంచలేదని గుర్తించారు. ఒక అంతస్తుకు 221.45 చదరపు మీటర్ల అనుమతి పొందగా 369.86 చదరపు మీటర్ల చొప్పున నిర్మాణం సాగిస్తున్నట్టు నిర్ధారించారు. ఒక్కో అంతస్తుకు 148.41 చదరపు మీటర్ల చొప్పున అదనపు భాగాన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అదనంగా చేపట్టిన నిర్మాణాన్ని ఆదివారం తొలగించారు. తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అదనపు నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తాను అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టానంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారి నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులతో వాదనకు దిగారు. దీంతో వారు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, సెట్‌ బ్యాక్‌లు లేకపోవడం, అనుమతి పొందినదానికంటే అదనంగా నిర్మించడం తదితర విషయాలను వివరించారు. గాజువాక పోలీసుల సూచన మేరకు అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు  వెళ్లిపోవడంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అనధికార నిర్మాణాన్ని తొలగించారు. ఈ వ్యవహారం పల్లా మీడియాతో మాట్లాడారు. తనకు హైకోర్టులో ఊరట లభిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు తన భవనాన్ని తొలగించడం అన్యాయమన్నారు. 

వెలగపూడి ‘దుకాణాలు’ క్లోజ్‌..
కొమ్మాది (భీమిలి): ప్రశాంత విశాఖ నగరంపై దందాల సంతకం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి..అధికారాన్ని అడ్డంపెట్టుకొని విషపు సంస్కృతిని వ్యాపింపజేశారు. తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టి.. భీమిలి నియోజకవర్గంలోనూ పాగా వేశారు. ఆక్రమణల పర్వాన్ని అడ్డగోలుగా సాగించి ఫుట్‌పాత్‌లను సైతం మింగేశారు. అనుచరులకు నచ్చిన చోట ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు పెట్టించేసి దందా సాగించారు.

దుకాణాలను తొలగిస్తున్న జేసీబీ..    

అడ్డగోలుగా 70 దుకాణాలు.. 
జీవీఎంసీ 8వ వార్డు గీతం కాలేజీ డౌన్‌ నుంచి చిన్న రుషికొండ మీదుగా పెద్ద రుషికొండ వరకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 దుకాణాలు అడ్డగోలుగా పెట్టించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఈ ఆక్రమణల్లో వెలసిన ఒక్కో దుకాణం నుంచి ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసేవారు.

‘సాక్షి’ కథనాలతో బ్రేక్‌! 
అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్న ధైర్యంతో ఆక్రమణల పర్వం కొనసాగించాలనుకున్న వెలగపూడి బ్యాచ్‌ ఆగడాలకు ‘సాక్షి’ వరుస కథనాలు బ్రేక్‌ వేశాయి. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు జీవీఎంసీ అధికారులు స్పందిస్తూ వెలగపూడి దుకాణాలను 
బంద్‌ చేయించారు. మూడు రోజులుగా ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగిస్తున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వెలగపూడి అండ్‌ కో ఆక్రమించేసుకున్న బీచ్‌రోడ్డు ఫుట్‌పాత్‌లపై చర్యలకు ఉపక్రమించారు.

రైట్‌ టు వాక్‌ పేరుతో ఆక్రమణల తొలగింపు 
బీచ్‌రోడ్‌ వెంబడి ఫుట్‌పాత్‌లపై వెలగపూడి, టీడీపీ అనుచరులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్‌స్టాళ్లు, దుకాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం తొలగించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి పోలీసు బందోబస్తు నడుమ 70 బడ్డీలను తొలగించారు. ఫుట్‌పాత్‌లను కేవలం పాదచారులకు మాత్రమే వినియోగించేలా జీవీఎంసీ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం ‘రైట్‌ టు వాక్‌’ పేరుతో ఆక్రమణలను తొలగిస్తున్నట్టు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ రాంబాబు వెల్లడించారు. దీనికితోడు ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ బీచ్‌ రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్న నేపథ్యంలో కమిషనర్‌ ఆదేశాల మేరకు తాత్కాలిక ఆక్రమణలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు.

ఆక్రమణదారుల ఆందోళన.. 
ఫుట్‌పాత్‌పై అక్రమంగా వెలసిన బడ్డీల తొలగింపునకు నిరసనగా ఫుట్‌పాత్‌ ఆక్రమణదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బడ్డీలను తొలగిస్తున్నారని, కనీసం బడ్డీల్లోని సామగ్రిని తీసుకునే సమయం ఇవ్వనదున తీవ్రంగా నష్టం పోతున్నామని వాపోయారు. వీరితో టీడీపీ కార్యకర్తలు కలిసిపోయి గందరగోళం సృష్టించేందుకు ప్రయతి్నంచారు. పీఎంపాలెం సీఐ రవికుమార్‌ ఆక్రమణదారులతో మాట్లాడి సామాన్లు తీసుకెళ్లేందుకు సమయం ఇచ్చారు. వారంతా దుకాణాల్లోని సామగ్రిని తీసుకెళ్లిపోయారు. అనంతరం షాపుల తొలగింపు ప్రక్రియను సాయంత్రం వరకూ నిర్వహించారు. టౌన్‌ప్లానింగ్‌ టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్‌ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీలను తొలగించారు.
చదవండి:
మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం  
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ 

మరిన్ని వార్తలు