బ్లాక్‌ లిస్టులో పెట్టినా.. బాద్‌షాలా!

28 Apr, 2022 11:11 IST|Sakshi

టెండర్లు దక్కించుకొని.. పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించడం.. అడ్డగోలుగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను జీవీఎంసీ బ్లాక్‌ లిస్టులో పెట్టింది. అంటే కార్పొరేషన్‌ పరిధిలో ఏ పనులకు సంబంధించిన టెండర్లలో అయినా వారు పాల్గొనే అవకాశం ఉండదు. కానీ కొందరు ఇంజినీరింగ్‌ సిబ్బంది మాత్రం నిషేధిత  కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు. కొత్త టెండర్లలో వారికి చోటు కల్పించి పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సాక్షి, విశాఖపట్నం: వివిధ కారణాలతో గ్రేటర్‌ విశాఖ పరిధిలో పనులు నిర్వహిస్తున్న 26 మంది కాంట్రాక్టర్లను అప్పటి జీవీఎంసీ కమిషనర్‌ బ్లాక్‌ లిస్టులో పెట్టారు. చిన్నచిన్న తప్పులు చేసిన 21 కాంట్రాక్టు సంస్థల్ని ఏడాది పాటు.. విభిన్న రకాల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు కాంట్రాక్టర్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.

ఏడాది నిషేధం ఉన్న కాంట్రాక్టర్లలో చాలా మంది వరకూ ఈ ఏడాది జూలై వరకూ, ఐదేళ్ల నిషేధం ఉన్న కాంట్రాక్టర్లు 2025 డిసెంబర్‌ వరకూ ఏ విధమైన టెండర్లలో పాల్గొన కూడదు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొందరు బ్లాక్‌ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం నిషేధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ పిలుస్తున్న టెండర్లలో తమ అర్హతకు సరిపోయే పనుల్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 

ఇంజినీర్ల సహకారంతోనే.. 
బ్లాక్‌ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌ ఏదైనా ఈ–టెండర్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించిన వెంటనే రిజెక్ట్‌ లిస్టులో చేరే వ్యవస్థ జీవీఎంసీలో ఉంది. సదరు కాంట్రాక్టర్‌ ఫర్మ్‌ పేరు మార్చి పాన్‌ కార్డు, లేదా ఆధార్, జీఎస్‌టీ నంబర్‌.. ఇలా ఏదైనా ఎంటర్‌ చేసినా టెండర్‌ తిరస్కరించాలి. అదే విధంగా ఈఎండీ(ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌)ని తిరిగి సదరు బ్లాక్‌ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు. పదేపదే రిజెక్ట్‌ చేసినా టెండర్లలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే సదరు కాంట్రాక్టర్‌ నిషేధాన్ని మరికొద్ది రోజులు పొడిగించే అధికారాలు జీవీఎంసీ అధికారులకు ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెట్టేసి నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాసే పనిలో ఇంజినీరింగ్‌ సిబ్బంది తలమునకలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్‌ లిస్టులో ఉన్నా వారికి ఎలాగైనా కాంట్రాక్టు దక్కించుకునేలా కుయుక్తులు పన్నుతున్నారు. ఉదాహరణకు ఇటీవలే యూపీహెచ్‌సీ టెండర్ల వ్యవహారంలోనూ ఇదే పద్ధతి అవలంబించారు.

రూ.కోట్ల విలువ చేసే పనులని దక్కించుకునేందుకు ఐదేళ్ల బ్లాక్‌ లిస్టులో ఉన్న ఓ కాంట్రాక్టర్‌ ఆ టెండర్లలో పాల్గొన్నారు. దాదాపు అన్ని టెండర్లలోనూ టెక్నికల్‌ బిడ్‌ వరకూ ఆ కాంట్రాక్టర్‌ను ఇంజినీరింగ్‌ సిబ్బంది తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి ఆ కాంట్రాక్టర్‌ను టెండర్‌ ప్రారంభ దశలోనే రిజెక్ట్‌ చేయాల్సి ఉంది. కానీ.. కొందరు ఇంజినీరింగ్‌ అధికారులు సిబ్బంది కలిసి.. చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. టెండర్లు ఫైనలైజ్‌ చేసే సమయంలో ఉన్నతాధికారులు విషయాన్ని గుర్తించి.. నిషేధిత కాంట్రాక్టర్‌ను పక్కన పెట్టారు. 

పదే పదే.. అదే శైలి.. 
ఈ ఒక్క కాంట్రాక్టర్‌ మాత్రమే కాదు బ్లాక్‌ లిస్టులో ఉన్న కొందరు కాంట్రాక్టర్లు తమ ఫర్మ్‌ పేరు మార్చి.. పాత పాన్, ఆధార్‌ నంబర్‌తో టెండర్లలో పాల్గొంటున్నారు. ఈ విషయం ఇంజినీరింగ్‌ సిబ్బందికి తెలిసినా.. ఏమీ తెలీనట్లుగా వారికి టెండర్లు అప్పగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు. ఇప్పటికైనా బ్లాక్‌ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లపై నిశిత దృష్టితో వ్యవహరించకపోతే జీవీఎంసీ పనుల వ్యవహారంలో మళ్లీ అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని కార్పొరేషన్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   

(చదవండి: కరాటే క్వీన్స్‌: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్‌ కిడ్‌)

మరిన్ని వార్తలు