ఇదో మంచి 'బ్యాక్టీరియా'..

14 Feb, 2021 05:18 IST|Sakshi
మురుగునీటిని శుద్ధిచేసే బ్యాక్టీరియా

మురుగునీటినీ శుద్ధిచేస్తుంది

మూడు రకాల బ్యాక్టీరియాలతో జీవీఎంసీ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌

విశాఖ అప్పుఘర్‌లో ప్రయోగాత్మకంగా అమలు

వారం రోజుల్లోనే దుర్వాసన మాయం

వెయ్యి లీటర్ల మురుగునీటిని లీటర్‌ బ్యాక్టీరియాతో శుద్ధి

సాక్షి, విశాఖపట్నం: నగరంలో నిత్యం వస్తున్న మురుగునీటిని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) శుద్ధిచేసి పరిశ్రమలకు కొంత, మిగిలినది సముద్రంలోకి విడిచిపెడుతుంది. ఈ క్రమంలో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ)లు.. వాటి పరిసరాలు చాలా దుర్వాసన వెదజల్లేవి. పాదచారులు, వాహనచోదకులు ఆ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఈ తరుణంలో జీవీఎంసీ అధునాతన బయో సాంకేతికతను అందిపుచ్చుకుంది. అదే బయోరెమిడేషన్‌. అంటే.. మంచి బ్యాక్టీరియాలతో మురుగునీటిని శుభ్రంచేయడం. ఇందుకోసం పయోనీర్‌ ఎన్విరాన్‌ కేర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మూడు పద్ధతుల్లో.. ఈ మురుగునీటిని శుభ్రం చేస్తున్నారు. 

ఎలా చేస్తున్నారంటే..
మానవాళికి మంచి చేసే బ్యాక్టీరియాలుంటాయి. ఇందులో ఫొటోట్రోఫిక్, లాక్టోబాసిలస్, రోడో సుడోమాస్‌ అనే బ్యాక్టీరియాలను పయోనీర్‌ సంస్థ తమ ల్యాబ్‌లో ఉత్పత్తి చేస్తుంది. వీటిని అప్పుఘర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తీసుకొచ్చి మంచినీటిలో పెంచుతారు. ఇవి పెరిగేందుకు మొలాసిస్‌ను ఆహారంగా వేస్తారు. 5–7 రోజుల్లో ఇవి పెరుగుతాయి. వీటికి కావల్సిన ఉష్ణోగ్రతను కూడా దశల వారీగా అందిస్తారు. మొదటి నాలుగు రోజులు 1–5 డిగ్రీలు, తర్వాత 5–15 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెంచుతారు. ఇలా వారం రోజుల్లో 0–50 డిగ్రీల ఉష్ణోగ్రతని తట్టుకునేలా వీటిని తయారుచేస్తారు. ఫొటోట్రోఫిక్‌ బ్యాక్టీరియా చెత్తనీటిలో ఆక్సిజన్‌ లెవల్స్‌ను పెంచుతుంది. లాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా సీవేజ్‌ వాటర్‌లో 80 శాతం ఆర్గానిక్‌ వ్యర్థాలను తినేస్తుంది. రోడో సుడోమాస్‌ కొన్ని ఎంజైమ్‌లు విడుదల చేసి.. మిగిలిన రెండు బ్యాక్టీరియాలకు అవసరమైన శక్తిని అందించి.. శుద్ధిచేసే పనిని వేగవంతం చేస్తుంది. వీటిని పెద్దపెద్ద డ్రమ్ముల్లో పెంచుతారు. 1 లీటర్‌ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు ఖర్చవుతుంది.
ఎరేషన్‌ ట్యాంకులో శుభ్రమవుతుందిలా.. 

వెయ్యి లీటర్ల మురుగుకు లీటర్‌ బ్యాక్టీరియా
ఇలా పెరిగిన బ్యాక్టీరియాని ఎస్టీపీలోకి విడిచి పెడతారు. వెయ్యి లీటర్ల మురుగు నీటికి బ్యాక్టీరియా ఉన్న లీటర్‌ నీటిని కలుపుతారు. వివిధ మురుగు కాలువలు, మరుగుదొడ్ల నుంచి వచ్చిన నీరు స్టోర్‌ అయిన ఇన్‌లెట్‌లోకి బ్యాక్టీరియాని పంపిస్తారు. అక్కడి నుంచి ఎరేషన్‌ ట్యాంకులోకి వెళ్తుంది. ఈ ట్యాంకులో ఆక్సిజన్‌ శాతం సరైన మోతాదులో ఉంటే.. ఈ బ్యాక్టీరియాలు తమ పనిని వేగవంతం చేస్తాయి. చెత్తను, మురుగుని తినేయడం ప్రారంభిస్తాయి. మొత్తంగా నీటిని 4 గంటల వ్యవధిలోనే శుభ్రం చేసేస్తాయి. ఇలా శుభ్రం చేసిన నీటిని అవుట్‌లెట్‌లోకి పంపిస్తారు. అక్కడ మరోసారి శుభ్రంచేసి అక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టడం, పరిశ్రమలకు అందించడం చేస్తారు.
ఇన్‌లెట్‌లోకి బ్యాక్టీరియాని ఇలా విడిచిపెడతారు.. 

పర్యావరణహితంగా అమలుచేస్తున్నాం..
మురుగునీటిని శుద్ధిచేశాకే బయటకి విడిచిపెట్టాలన్నది నిబంధన. ఈ మేరకు ఎస్టీపీల్లో శుద్ధిచేస్తున్నాం. అయితే, మరింత అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటిని పునర్వినియోగం చేసేందుకు జీవీఎంసీ కమిషనర్‌ సంకల్పించారు. ఆమె సూచనల మేరకు రెండు ఎస్టీపీల్లో బయో రెమిడేషన్‌ అమలుచేశాం. సత్ఫలితాలిస్తోంది. వారం రోజుల్లోనే దుర్వాసన దాదాపు తగ్గిపోయింది. ఇక నగరంలోని అన్ని ఎస్టీపీల్లో దీనిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తాం. 
– వేణుగోపాలరావు, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ

ప్రాణవాయువు విడుదల చేసి స్వచ్ఛంగా మారుస్తాయి
రసాయనాలతో పనిలేకుండా బయో టెక్నాలజీతో మురుగునీటి వనరుల్ని శుభ్రంచేస్తున్నాం. మానవాళికి మంచిచేసే బ్యాక్టీరియాలు నీటిలోని కాలుష్య కారకాల్ని ఆహారంగా తీసుకుని ప్రాణవాయువుని విడిచిపెట్టి.. వాటిని స్వచ్ఛంగా మారుస్తాయి. కేవలం నాలుగైదు గంటల్లోనే మురుగునీరు మంచి నీరుగా మారిపోతుంది. ఫార్మా కాలుష్యాలను కూడా దీని ద్వారా శుద్ధిచేయగలం. 
– దండు వెంకటవర్మ, పయోనీర్‌ ఎన్విరాన్‌ కేర్‌ సీఈఓ 

మరిన్ని వార్తలు