ఏపీ నుంచే నేరుగా హజ్‌ యాత్ర

23 Feb, 2023 04:53 IST|Sakshi
హజ్‌ యాత్ర పోస్టర్‌ విడుదల చేస్తున్న హజ్‌ కమిటీ చైర్మన్‌ బద్వేల్‌ షేక్‌ గౌసల్‌ హజమ్, ఎమ్మెల్సీ బాషా తదితరులు

తొలిసారి విజయవాడ నుంచి విమాన సౌకర్యం

ఫలించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి 

దేశంలో మరెక్కడా లేని విధంగా యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం 

జిల్లా కేంద్రాల నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సులు 

మక్కాలోనూ ఆంధ్ర యాత్రికులకు ఒకే ప్రాంగణంలో వసతి, సౌకర్యాలు 

ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ చైర్మన్‌ బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజమ్‌ వెల్లడి

సాక్షి, అమరావతి:  హజ్‌ (మక్కా) యాత్రకు వెళ్లే రాష్ట్రానికి చెం­దిన ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ నుంచి ప్రత్యేక విమాన సౌకర్యం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా హజ్‌ యాత్రికుల కోసం విజయవాడలో ఇమిగ్రేషన్‌కు కేంద్ర విమా­నయాన శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఏపీకి చెందిన హజ్‌ యాత్రికులు ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి వెళ్లేవారు. ఈ ఏడాది నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచే నేరుగా వెళ్లొచ్చు.

ఈ అవకాశాన్ని రాష్ట్రానికి చెందిన ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలి’ అని ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ చైర్మన్‌ బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజమ్‌ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో హజ్‌ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. యాత్ర ఏర్పాట్లపై రూపొందించిన కరపత్రాలు, వాల్‌­పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సమావేశం నిర్ణ­యా­లను సభ్యులతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. 

దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో 
హజ్‌ యాత్రకు వెళ్లేందుకు రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన బియ్యం కార్డుదారులకు రూ.60 వేలు, రూ. 3 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తోఫా ఇస్తోంది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇవ్వడంలేదు. తొలిసారి 70 ఏళ్ల పైబడిన వారు (1953 ఏప్రిల్‌ 30కి ముందు జన్మించిన వారు) దరఖాస్తు చేసుకుంటే లాటరీతో సంబంధం లేకుండా నేరుగా యాత్రకు ఎంపిక చేస్తారు.

70 ఏళ్లు పైబడిన వారు ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లొచ్చు. అదే విధంగా ఒంటరిగా ఉండే 45 ఏళ్ల పైబడిన మహిళలు కనీసం నలుగురు (2023 ఏప్రిల్‌ 30 నాటికి 45 ఏళ్లు నిండి ఉండాలి) కలిసి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఎంపిక చేస్తారు. ఒక వేళ ఇద్దరు మహిళలే దరఖాస్తు చేస్తే, కమిటీ ద్వారా మరో ఇద్దరు మహిళలను కలిపి పంపిస్తారు. ఈసారి 12 ఏళ్ల లోపు చిన్నారులకు సౌదీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు.

యాత్రకు వెళ్లే వారి కోసం హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా హజ్‌ సొసైటీల ద్వారా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. యాత్రికుల కోసం జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేకంగా బస్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. వారిని సాగనంపేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు సైతం గన్నవరంలోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు, విజయవాడలోని మదరసాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వీరి సహాయార్ధం వలంటీర్లను సైతం నియమిస్తున్నారు. ప్రయాణానికి 48 గంటల ముందు రిపోర్టు చేసే యాత్రికులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మక్కాలో కూడా ఏపీ నుంచి వెళ్లే యాత్రికులకు ఏపీ ప్రభుత్వం తరపున ఒకే ప్రాంగణంలో వసతి, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్టేట్‌ హజ్‌ కమిటీ చైర్మన్‌ బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజమ్‌ తెలిపారు.

కమిటీ సమావేశంలో సభ్యులైన ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా, సయ్యద్‌ వలియుల్లా హుస్సేన్, çమహమ్మద్‌ ఇమ్రాన్, షేక్‌ గులాబ్జాన్, షేక్‌ అతువుల్హా తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు చేయండిలా.. 
హజ్‌ యాత్రకు వెళ్లే వారు http:hajcommittee.gov.in  ద్వారా లేదా స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మార్చి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి 

► దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు–2, పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు–4, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం జిరాక్స్‌ లేదా క్యాన్సిల్డ్‌ బ్యాంక్‌ చెక్‌ సమర్పించాలి 

► ఉచితంగా దరఖాస్తు చేసేందుకు జిల్లా హజ్‌ సొసైటీల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు 

► దరఖాస్తు ప్రింట్‌ కాపీతో పాటు అవసరమైన పత్రాలు, అడ్వాన్స్‌ ఫీజు రసీదు, మెడికల్‌ సర్టిఫికెట్లను డ్రా తర్వాత ఏపీ హజ్‌ కమిటీ కార్యాలయంలో అందజేయాలి 

మరిన్ని వార్తలు