ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు

23 Mar, 2021 03:49 IST|Sakshi

ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఒక్కపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే బడి ఉంటుంది. మే 31వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జూన్‌లో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి.

పెరుగుతున్న ఎండలు, కరోనా కేసుల కారణంగా తరగతులు ముగిసిన తరువాత పాఠశాల నుంచి విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సురేష్‌ సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలల్లో కూడా కోవిడ్‌ నిబంధనలు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామని చెప్పారు. విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహణ, మాస్క్‌ లు ధరించడం, శానిటైజర్‌ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. పాఠశాలల్లో కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రతి జిల్లా నుంచి నివేదికలు కోరుతున్నామని, ఎక్కడా ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.  

>
మరిన్ని వార్తలు