ఇంగ్లండ్‌లో ప్రజా చైతన్యం ఎక్కువ

26 Dec, 2022 05:26 IST|Sakshi
తల్లి కృష్ణకుమారి, ఇతర కుటుంబసభ్యులు, మిత్రులతో అరుణ్‌

హ్యాంప్‌షైర్‌ కౌంటీ కౌన్సిలర్‌ అరుణ్‌ ముమ్మలనేని 

ప్రజా ప్రతినిధులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తారు 

నాది వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి రాజకీయం 

తెనాలి: ఇంగ్లండ్‌లో ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని, ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువని హ్యాంప్‌షైర్‌ కౌంటీ కౌన్సిలర్‌ అరుణ్‌ ముమ్మలనేని చెప్పారు. అక్కడి నాయకులు గాలివాటుగా వాగ్దానాలు చేయడం కుదరదని, అలా చేసినందువల్ల దేశ ప్రధానమంత్రి సైతం పదవి నుంచి వైదొలగినట్టు గుర్తుచేశారు. స్వస్థలం వచ్చిన అరుణ్‌ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలోని మిత్రుడు కుర్రా శ్రీనివాసరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన వృత్తి ఉద్యోగమని, రాజకీయం ప్రవృత్తి మాత్రమేనని తెలిపారు. పుట్టినగడ్డలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆయన తెలిపిన వివరాలు..  

► నా స్వస్థలం రేపల్లె దగ్గర్లోని చాట్రగడ్డ. పెరిగిందీ, చదువుకుందీ అమ్మమ్మగారి ఊరైన అమృతలూరు మండలం, మోపర్రు గ్రామం. కాకినాడ, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చేశాక సీఎంసీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంగ్లండ్‌ వెళ్లాను.  
► హ్యాంప్‌షైర్‌ కౌంటీలోని బేజింగ్‌స్టోక్‌ వాయవ్య నియోజకవర్గం ప్రతినిధిగా గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి భారీ మెజారిటీతో ఎన్నికైన తొలి శ్వేత జాతీయేతరుడిని.  
► పార్టీ బేజింగ్‌స్టోక్‌ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నా. అక్కడి ప్రాథమిక సభ్యుల ఆమోదంతో ఎంపీగా పోటీచేసేందుకు అర్హత లభించింది. బేజింగ్‌స్టోక్, బారో కౌన్సిల్‌కూ ఎన్నికయ్యాను. స్త్రీ శిశు, కుటుంబ సంక్షేమ అడ్వయిజరీ ప్యానల్‌ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు ఫ్రీలాన్స్‌ కన్సల్టెంటుగా ఉన్నా. 
► ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాక తెలుగువారితో ఓ సంఘం ఏర్పాటులో భాగస్వామినయ్యా. బేజింగ్‌స్టోక్‌ కల్చరల్‌ ఫోరం చైర్మన్‌గానూ చేస్తున్నా. తెలుగు బడి పేరుతో వారాంతాల్లో మన వాళ్ల పిల్లలకు తెలుగు నేర్పుతున్నాం. 
► ఇంగ్లండ్‌లో నిజమైన అర్హులకే సంక్షేమ పథకాలు లభిస్తాయి. అనర్హులు వాటిని ఆశించరు కూడా.  
► ప్రతి ఒక్కరి ఆదాయం, ఖర్చు లెక్కలు ప్రభుత్వాని­కి తెలుస్తుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. 10వ తరగతి వరకు నిర్బంధ విద్య ఉంటుంది.  
► సేవా కార్యక్రమాల్లో భాగంగా చాట్రగడ్డలో వృద్ధాశ్రమానికి వితరణ, మోపర్రు, పరిసరాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం ప్లేట్లు, పుస్తకాలు, యూనిఫాంలు అందించాను.  
► కోవిడ్‌ రోజుల్లోకూడా పలు సేవలు చేశాం. ప్రతిభా­వంతులైన పేద విద్యార్థులను చదివిస్తున్నాను.   

మరిన్ని వార్తలు