సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్‌ చాలీసా

22 Apr, 2021 03:56 IST|Sakshi
వెండి హనుమాన్‌చాలీసా సూక్ష్మ పుస్తకం

22 రేకుల్లో 40 శ్లోకాలు 

రాజాం యువకుడి ప్రతిభ 

రాజాం సిటీ: సూక్ష్మ వెండి పుస్తకంలో హనుమాన్‌ చాలీసాను చెక్కి ప్రతిభ నిరూపించుకున్నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, స్వర్ణకారుడు ముగడ జగదీశ్వరరావు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా రజత పుస్తకం రూపొందించానని తెలిపారు. మొత్తం 22 పేజీలు గల 11 వెండి రేకులలో 40 హనుమాన్‌ చాలీసా శ్లోకాలను చేతితో చెక్కినట్లు పేర్కొన్నారు.

1.060 మిల్లీ గ్రాముల బరువుతో 3.2 సెంటీమీటర్ల పొడవు, 2.3 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ పుస్తకం తయారు చేశానని తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం పట్టిందన్నారు. పుస్తకం మొదటి పేజీలో ఆంజనేయుడు, ఆఖరి పేజీలో శ్రీరాముడు చిత్రపటాలను చెక్కినట్లు చెప్పారు. గతంలోనూ దేశనాయకులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫొటోలను వెండి కాయిన్లపై చెక్కి అబ్బురపరిచారు. 

గిన్నిస్‌బుక్‌ లక్ష్యం.. 
గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించేందుకు ఈ మైక్రో ఆర్ట్‌ను ఎంచుకున్నాను. ప్రతి రోజు ఏదో ఒక చిత్రాన్ని వెండి కాయిన్‌పై రూపొందిస్తున్నా. భారతదేశ చిత్రపటాన్ని పెన్సిల్‌ ముల్లుపై 50 సెకన్లలో వేసినందుకు క్రెడెన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు అవార్డు లభించింది. మరింతగా సూక్ష్మమైన ఆర్ట్‌వేసి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదిస్తా. 
– ముగడ జగదీశ్వరరావు, మైక్రో ఆర్టిస్ట్, రాజాం  

మరిన్ని వార్తలు