కష్టకాలంలో మంచి నిర్ణయాలు 

9 Jan, 2022 03:35 IST|Sakshi
ముఖ్యమంత్రి చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం చేస్తున్న ఉద్యోగులు

పీఆర్సీపై ఉద్యోగుల్లో ఆనందం

ఎంఐజీలో ఇళ్ల స్థలాలు ఊహించలేదని హర్షం

రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకున్నామని వ్యాఖ్య

అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం

సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సొంతింటి కల దిశగా ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు తాము ఊహించలేదని, మొత్తంగా పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, కష్టకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్‌ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. 

జగన్‌ చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం 
శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర వరాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన చిత్రపటాన్ని స్వర్ణ పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు చెంచురత్నంయాదవ్, నారాయణరెడ్డి, రవికాంత్, నాగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు కృష్ణగిరి రెడ్డి, గోపి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత రమణయ్య, పురపాలక, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఉద్యోగుల్లో పండుగ సందడి 
ప్రభుత్వం పీఆర్సీ 23 శాతం పెంచడంతో పాటు పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డా.బి.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఆయన ఉద్యోగుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60  నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలసి కేక్‌ కట్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  

ఉద్యోగులు ఆశించినట్లే హెచ్‌ఆర్‌ఏ ఉంటుంది 
హెచ్‌ఆర్‌ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి, లేదా పీఆర్సీ కమిషనర్‌ సూచించిన శ్లాబులనైనా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశాం. పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. హెచ్‌ఆర్‌ఏ ఉద్యోగులు ఆశించినట్లే ఉంటుంది. సీఎం నిర్ణయాల పట్ల అందరూ ఆనందంగా ఉన్నారు.
– కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

ప్రభుత్వంపై నమ్మకం ఉంది 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద మాకు నమ్మకముంది. అదనపు పెన్షన్‌ విషయంలో సీఎస్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని చెప్పాం. 62 ఏళ్లకు పదవీ విరమణ, సొంతింటి కల మేము ఊహించని నిర్ణయం. అన్ని సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. 
    – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి

సచివాలయాల ఉద్యోగులకు మేలు 
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియక కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లందరికీ తప్పకుండా రెగ్యులర్‌ అవుతుంది. ఇతర ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల విషయంలో ఏ శాఖలో అయినా నియామకం చేయాలని కోరాం. 
    – కె.వి.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

నేటి సమావేశం వాయిదా
ఈ నెల 7న సీఎం జగన్‌ ప్రకటించినవి కాకుండా మిగిలిన విషయాల గురించి శనివారం సీఎంవో అధికారులతో చర్చించాం. కోవిడ్, నాన్‌ కోవిడ్‌లో చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు చేయాలని కోరాం. సానుకూలంగా నిర్ణయాలు జరిగాయి కాబట్టి మా కార్యాచరణ కోసం ఆదివారం జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నాం. 
    – వైవీ రావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత 

డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్‌ 
ఫిట్‌మెంట్‌ విషయంలో ఉపాధ్యాయులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్‌ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్పారు. మేమంతా అర్థం చేసుకుని ఆమోదించాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతున్నాయి.  
    – జోసెఫ్‌ సుధీర్‌ బాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
 
ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని కోరాం. సీఎంవో అధికారులను కలిసి మా సమస్యను వివరించాం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని విన్నవించాం. ఉన్నతాధికారి అజయ్‌ జైన్‌ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్మాణ భవన్‌లో నిర్వహిస్తామన్నారు. 
– బత్తుల అంకమ్మ రావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి 

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు  
కొత్త పీఆర్సీలో భాగంగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా కొత్త స్కేల్స్‌ వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాలతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌)కు ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు దక్కడం పట్ల గర్వంగా ఉంది.   
    – కె.నాగరాజు, స్టేట్‌ సెర్ప్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ కన్వీనర్‌ 

సీఎం నిర్ణయం సాహసోపేతం
ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనది. ఈ పీఆర్సీలో మానవత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేరుగా చూడటంలేదు. ప్రభుత్వంలో అంతర్భాగంగా చూస్తోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ,  ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగుల కష్టాలను తీరుస్తోంది. రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంచటంపై ఎల్లో మీడియా పెదవి విరచడం దారుణం. చంద్రబాబు వయస్సు ఎంత, ఎందుకు రాజకీయాలకు రిటైర్మెంట్‌ ఇవ్వడంలేదో చెప్పాలి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు జగనన్న ఇచ్చిన సంక్రాంతి కానుక. 
     – వెన్నపూస గోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ 

మరిన్ని వార్తలు